జనగామ చౌరస్తా, మార్చి 13 : కేశాలంకరణ(Hair )మహిళల అందాన్ని మరింత ద్విగిణీకృతం చేస్తుంది. కొప్పున్నమ్మ జడ ఎలా వేసినా అందమే అనే నానుడి వాటి ప్రాధాన్యతను చాటి చెబుతుంది. అమ్మాయిల ముఖ వర్చస్సును కేశాలంకరణ మరింత పెంచుతాయి. ఇంకా చెప్పాలంటే పొడుగు జడ ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అలాంటిది కొంతమందికి జుట్టే లేకుంటే వారి బాధలు వర్ణనాతీతం. అలాంటి వారి కోసం తన వంతు సాయం అందించేందేకు ఓ యువకుడు మానవత్వంతో ముందుకొచ్చాడు. క్యాన్సర్ బారిన పడిన అభాగ్యులకు హెయిర్ డొనోట్(Hair donates) చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు.
వివరాల్లోకివ వెళ్తే..హైదరాబాద్‌లోని ‘హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్’ సంస్థకు గురువారం జనగామ జిల్లాకు చెందిన రేవన్ జాయ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ తాటికాయల శరత్ తన హెయిర్స్‌ను డొనేట్ చేశారు. జిల్లాలోని జఫర్గడ్ మండలం హిమ్మత్ నగర్‌కు చెందిన శరత్ గత 12 ఏళ్లుగా రేవన్ జాయ్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది పేదలకు, పిల్లలకు, మహిళలకు సహాయం అందిస్తున్నారు. క్యాన్సర్ బారినపడి జుట్టును కోల్పోయిన నిరుపేద మహిళలు అనేక మంది ఆత్మస్థైర్యం కోల్పోయి, నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు.
మాతృ మూర్తులైన ఆ మహిళల్లో మళ్లీ ఆత్మస్థైర్యం పెంపొందించడానికి గత మూడేళ్లుగా శ్రద్ధతో 25 ఇంచుల పొడవైన జుట్టును పెంచి హెయిర్ డొనేషన్ సంస్థకు దానం చేసినట్లు పేర్కొన్నారు. సదరు సంస్థ ద్వారా మహిళా క్యాన్సర్ పేషెంట్లకు ఈ హెయిర్స్‌ను విగ్గు రూపంలో అందజేస్తారని తెలిపారు. పేదలకు అన్నదానం ఒకటే కాదు విద్యా దానం, అవయవ దానంతో పాటు కేశ దానం (హెయిర్స్) కూడా చేయాలని శరత్ పిలుపునిచ్చారు. ఇంకా ఎవరైనా మానవతా వాదులు తమ జుట్టును హెయిర్ డొనేషన్ సంస్థకు దానం చేయాలనుకుంటే ఆ సంస్థ చైర్మన్ ఎనుముల శివ 9666406586, అవయవ దానం గురించి అమ్మ ఆర్గాన్ డొనేషన్ సంస్థ చైర్మన్ ఈశ్వర లింగంను 9491074940 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. డాక్టర్ శరత్ సేవా గుణంపై ప్రశంసలు వెల్లువెత్తాయి.