రాజన్న సిరిసిల్ల : చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన యువతి షాలినిని మంగళవారం తెల్లవారుజామున 5:20 గంటలకు కిడ్నాప్‌నకు గురైన విషయం విదితమే. తమ కూతురు కిడ్నాప్‌పై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉండగానే.. షాలిని, జానీ కలిసి ఓ వీడియో విడుదల చేశారు.
గత నాలుగేండ్ల నుంచి జానీ, నేను ప్రేమించుకుంటున్నాం. గతేడాది వివాహం చేసుకున్నాం. మా తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మేం మైనర్లం కావడంతో జానీని జైలుకు పంపించారు. ఇప్పుడు నాకు వేరే సంబంధాలు చూస్తున్నారు. దీంతో వచ్చి తీసుకెళ్లమని జానీకి నేనే ఫోన్ చేసి చెప్పాను. నా కోరికపైనే జానీ తనను తీసుకెళ్లాడు. జానీ మాస్కు ధరించి రావడంతో గుర్తు పట్టలేకపోయాను. కారులో ఎక్కించిన తర్వాత జానీ మాస్కు తీయడంతో గుర్తు పట్టాను. ఆ తర్వాత జానీని ఇష్టపూర్వకంగా ప్రేమ వివాహం చేసుకున్నాను. జానీ దళితుడైనందునే మా పెళ్లికి ఒప్పుకోలేదు. మా తల్లిదండ్రుల నుంచి ప్రాణభయం ఉంది. మాకు రక్షణ కల్పించాలని పోలీసులను, మీడియాను కోరుతున్నానని షాలిని తన వీడియోలో పేర్కొంది.