హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న, విద్యాపరంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. బుధవారం విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డికి జాక్ నేతలు వినతిపత్రం సమర్పించారు. బీఈడీ/డీఈడీ అర్హత కలిగిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్లుగా ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలకు పదివేల పీఎస్ హెడ్మాస్టర్ పోస్టులను మంజూరు చేయాలని విన్నవించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడంతోపాటు, సావెంజర్లను నియమించాలని డిమాండ్ చేశారు. పదోన్నతి పొందకుండా మిగిలిపోయిన 600 మంది పండితులను అప్గ్రేడ్ చేయాలని కోరారు. మాడల్ స్కూళ్లలో ఔట్సోర్సింగ్ ఫిజికల్ డైరెక్టర్లను కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.