SG Group | హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఈవీల తయారీ కేంద్రం ఏర్పాటుకు ఎస్జీ గ్రూప్ ఆసక్తి చూపుతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం ఎస్జీ గ్రూప్ ఎండీ యోగేష్ భాటియా, పీఎస్ఆర్ గ్రూప్ ఎండీ శ్రీరంగారావులు సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రూ.3వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు యోగేష్ భాటియా ముందుకొచ్చారని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తద్వారా 1,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అంతకుముందు రాష్ట్రంలో ఈవీల ఉత్పత్తికున్న అనుకూలతల్ని మంత్రి భాటియాకు వివరించారు. పెట్టుబడులు పెడితే అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై భాటియా సానుకూలంగా స్పందించారు.