పాలకుర్తి రూరల్, ఆగస్టు 12: జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెలలో విద్యార్థినికి సెలవులు రావడంతో ఇంటికి వెళ్లింది. సెలవులు అయిపోయినా పాఠశాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నది. పాఠశాలకు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పినా వెళ్లనని మొండికేసింది. ఎందుకు వెళ్లవని తల్లిదండ్రులు నిలదీయడంతో బాలిక ఆసలు విషయం చెప్పింది. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న వంట సిబ్బంది తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని విద్యార్థిని కన్నీటి పర్యంతమైంది.
సోమవారం ఆ విద్యార్థినిని తీసుకుని తల్లిదండ్రులు పాలకుర్తిలోని గురుకుల పాఠశాలకు వచ్చి తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్‌కు వివరించారు. అందుకు ప్రిన్సిపాల్ సమాధానం చెప్పకపోవడంతోపాటు విద్యార్థిని, తమపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తల్లిదండ్రులు వాపోయారు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. గత శనివారం కూడా వంట సిబ్బంది తాగి వస్తున్నాడని, అన్నం మెత్తగా వండి పెడుతున్నాడని వంట నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా ఆమె పట్టించుకోకపోవడం గమనార్హం.