హైదరాబాద్ సిటీబ్యూరో/సైదాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): సైదాబాద్ జువెనైల్ చిల్డ్రన్ హోంలో దారుణం చోటుచేసుకుంది. తన కామవాంఛను తీర్చుకోవడానికి హోం పర్యవేక్షకుడు అబ్దుల్ రెహమాన్ నలుగురు బాలురపై లైంగికదాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్నారులను కంటికి రెప్పల సంరక్షించాల్సిన పర్యవేక్షకుడు అహజరీతిలో కొన్ని నెలలుగా వారిపై తరచూ లైంగికదాడికి పాల్పడుతున్నట్టు తెలిసింది. జువెనైల్ హోంలో 2024 నుంచి ఉంటున్న చాదర్‌ఘాట్‌కు చెందిన 14 ఏండ్ల బాలుడు దసరా పండుగకు ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. పండుగ తర్వాత తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని బీష్మించుకొని తల్లివద్ద బోరున విలపించాడు. ఎందుకు వెళ్లవని తల్లి ఆరా తీయగా తనపై జరిగిన లైంగికదాడి గురించి వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తల్లి.. బాలుడితో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బాలుడిని వైద్య పరీక్షలకు పంపించడంతో దారుణం బయటపడింది. మిగతా చిన్నారులకు కూడా జువెనైల్ హోం డాక్టర్ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. సౌత్ఈస్ట్ డీసీపీ చైతన్యకుమార్, సైదాబాద్ ఏసీపీ సోమ వెంకట్‌రెడ్డి, సైదాబాద్ ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్ జువెనైల్ హోంను సందర్శించి వివరాలను సేకరించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
జువెనైల్ ఉద్యోగి అబ్దుల్‌రెహమాన్‌పై లైంగికదాడితోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ బండారు చంద్రమోహన్ తెలిపారు. జువెనైల్ చిల్డ్రన్ హోం (బాయ్స్)లో ఔట్సోర్సింగ్ విభాగం ద్వారా ఎంపికైన అబ్దుల్ రెహమాన్ 2022 నుంచి పర్యవేక్షకుడిగా (స్టాఫ్ గార్డ్) పనిచేస్తున్నాడు. చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ అతనిపై గతంలోనే పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు అతన్ని విధుల నుంచి తొలగించాలని నిర్ణయించగా.. ఇకపై తప్పులు చేయనని హామీనిచ్చాడు. కొద్దిరోజులు మంచిగా ఉన్నట్టు నమ్మించి మళ్లీ చిన్నారులపై లైంగికదాడులకు పాల్పడినట్టు సమాచారం. మొదటిసారి ఆరోపణలు వచ్చినప్పడే అధికారులు అతనిపై చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. జువెనైల్ హోంలో ఎమైనా సంఘటనలు జరిగితే తామే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కానీ పోలీసులే హోంకు వచ్చి జరిగిన ఘటన గురించి చెప్పారని జువెనైల్ హోం సూపరింటెండెంట్ సయ్యద్ అప్జల్ షా వలీ అన్నారు.
ఘటనపై దర్యాప్తునకు మహిళా సూపరింటెండెంట్
జువెనైల్ హోంలో జరిగిన లైంగికదాడి సంఘటనపై దర్యాప్తుకు కాచిగూడ బాలికల సదనం (జువెనైల్ ఫర్ గ్లల్స్ హోం) సూపరింటెండెంట్ మైథిలీని నియమించారు. బాలుర సదనంలో చిన్నారులతో మాట్లాడి వివరాలను సేకరించామని, మైనర్ బాలుడిపై లైంగికదాడి జరిగిన మాట వాస్తవమేనని మైథిలీ తెలిపారు. ఇదే విషయంపై నివేదికను రూపొందించి.. ఉన్నతాధికారులకు, సీడబ్ల్యూసీ అధికారులకు అందజేస్తామని చెప్పారు.