హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ):శాసనసభకు ఎన్నికై ఎమ్మెల్యే హోదాలో అధ్యక్షా.. అంటూ ప్రసంగించాలన్నది ఎంతో మంది రాజకీయ నాయకుల కల. నియోజకవర్గ ప్రజల ప్రతినిధిగా హాజరై తమ ప్రాంత సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని భావిస్తుంటారు. ఆ అవకాశం పలువురు నూతన ఎమ్మెల్యేలకు గురువారం కలిగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత మొదట ‘జీరో అవర్’ నిర్వహిస్తున్నట్టు స్పీకర్ ప్రసాద్‌కుమార్ ప్రకటించారు. మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు సభలో 57 మంది ఉన్నారని, వారిలో కొందరికి తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించే అవకాశం ఇస్తున్నట్టు చెప్పారు.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాల ఉత్పత్తిదారులకు ఇచ్చే 4 శాతం బోనస్‌ను మరింత పెంచాలని గత ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తుచేశారు. పెంచిన బోనస్ రెండు నెలలుగా అందడం లేదని, వెంటనే ఇప్పించాలని కోరారు. పాలను సేకరించి హైదరాబాద్‌కు పంపిన తర్వాత నాణ్యతగా లేవంటూ తిప్పి పంపుతుండటంతో రైతులు నష్టపోతున్నారని సభ దృష్టికి తెచ్చారు. పాల సేకరణ సమయంలోనే నాణ్యత పరీక్షించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను అసెంబ్లీకి రావడానికి కారణమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తమ నియోజకవర్గంలో 18,021 మందికి దళితబంధు ఇచ్చారన్నారని చెప్పారు. రెండో విడతలో 2,800 మంది అర్హులకు ఇవ్వాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. దళితబంధు లబ్ధిదారులు ప్రస్తుతం నెలకు రూ.20-30 వేలు సంపాదిస్తున్నారని తెలిపారు. 100 పడకల దవాఖానలో ఐసీయూ పూర్తయిందని, అందుబాటులోకి తేవాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం 1.63 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పారు. మరికొన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలయ్యాయని తెలిపారు. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 2.33 లక్షల ఉద్యోగాలకు అదనంగా 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.