హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : ఇతరులకు సేవ చేయడమే మానవ జీవితానికి నిజమైన అర్థం అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మానవ సేవే జీవిత పరమార్థంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ ఆధ్వర్యంలో శుక్రవారం లోక్‌భవన్ సంస్కృతి హాల్లో ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం, ప్రపంచ తలసేమియా దినోత్సవం నిర్వహించారు. రెడ్‌క్రాస్ వ్యవస్థాపకుడు హెన్రీ డ్యూనెంట్ చిత్రపటానికి గవర్నర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, దాతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1920 నుంచి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ మానవ సేవకు అంకితభావంతో పనిచేస్తున్నదన్నారు. తెలంగాణలో వేల మంది రక్తదానం, ఆరోగ్య శిబిరాలు తదితర కార్యక్రమాల్లో విశేష సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్, సంయుక్త కార్యదర్శి శశికిరణాచారి, రెడ్‌క్రాస్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సీఈవో శ్రీరాములు పాల్గొన్నారు.