హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ఆంధ్రభూమి మాజీ ఎడిటర్, సీనియర్ జర్నలిస్టు ముళ్లపూడి సదాశివశర్మ(62) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించగా.. శుక్రవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈనాడు, ఆంధ్రప్రభ, కృష్ణపత్రిక, హిందీమిలాప్ పత్రికల్లో పనిచేశారు. దాదాపు నాలుగు దశాబ్దాలపాటు సదాశివశర్మ పత్రికారంగానికి ఎనలేని సేవలు అందించారు. ఆయనకు భార్య లక్ష్మీపద్మావతి, కుమార్తె శ్రీవిద్య ఉన్నారు. సదాశివశర్మ తండ్రి ముళ్లపూడి సూర్యనారాయణ ప్రముఖ సాహితీవేత్త. వికారాబాద్లో అధ్యాపకునిగా పనిచేస్తూ జాతీయ సాహిత్య పరిషత్తు ఏర్పాటులో ప్రధానపాత్ర పోషించారు. సదాశివశర్మ మృతి పట్ల మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.