హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ) : ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేశ్, చారి, సుధీర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ తెలిపారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. జర్నలిస్టుల అరెస్ట్‌లు మీడియా స్వేచ్ఛను హరించడమే అవుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛగా రాయడానికి వీలు లేదనే సంకేతాన్ని, రాష్ట్ర ప్రభుత్వం ఈ అరెస్ట్‌ల ద్వారా చెప్పినట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని విమర్శించారు. పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు వాటిలోని నిజానిజాలపై అధికారులతో విచారణ జరిపించాల్సింది అని అన్నారు.
కానీ ఒక అంశాన్ని బయటకు తీసుకొచ్చిన జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం సరికాదని పేర్కొన్నారు. జర్నలిస్టులు వారి దృష్టికి వచ్చిన అంశాలను ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తారు అని, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మంత్రులు, అధికారుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు, ఆ ఆరోపణల్లోని నిజాలను నిగ్గు తేల్చాల్సిన ప్రభుత్వం, జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేయడం సరైన చర్య కాదని మండిపడ్డారు. కథనంలో అవాస్తవాలు ఉంటే ఖండించాలే కానీ, జర్నలిస్టులను అరెస్టు చేయడం ఏమిటీ? అని ప్రశ్నించారు. లేదంటే కోర్టులో చాలెంజ్ చేయాలి అని హితవు పలికారు. అన్నింటికీ జర్నలిస్టులను బాధ్యులుగా చేసి, జైల్లో వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎవరి మీద ఎన్టీవీలో కథనం వచ్చిందో వారి మీద కూడా సిట్ వేసి, విచారణ జరుపుతారా? అని సర్కార్‌ను క్రాంతి ప్రశ్నించారు.