హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 26 ( నమస్తే తెలంగాణ ): ఓడిపోయే సీటు కోసం బీజేపీ సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కే లక్ష్మణ్ ఇద్దరూ కాలుదువ్వుతున్నారు. ముషీరాబాద్ సీటు కోసం పట్టుబడుతున్నారు. ఆ సీటును తన కుమార్తెకు ఇవ్వాలని దత్తాత్రేయ కోరుతుండగా, అది తనకే దక్కుతుందని లక్ష్మణ్ చెప్పుకుంటున్నారు.
విజయలక్ష్మి, లక్ష్మణ్.. ఎవరికి వారే ఆ సీటు తమదేనని ప్రచారం చేసుకుంటున్నారు. ముషీరాబాద్ సీటు తనదేనని చెప్పుకుంటున్న లక్ష్మణ్.. పార్టీ తనకు మరేదైనా పదవి ఆఫర్ చేసినా, ఆ సీటు మాత్రం తన అనుచరుడికే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తున్నది. తాను కనుక ఆ స్థానాన్ని వదులుకుంటే బండారు కుటుంబానికి అది సొంతమవుతుందని భయపడుతున్నారు. ఆ సీటును తనకే ఇవ్వాలని పార్టీ పెద్దల వద్ద అల్టిమేటం కూడా జారీ చేసినట్టు సమచారం. లక్ష్మణ్ కనుక ముషీరాబాద్‌లో బరిలో ఉంటే తాము కూడా తగ్గబోమని, అవసరమైతే రెబల్‌గా పోటీ చేస్తామని బండారు వర్గం చెప్పుకుంటున్నది. అదే సీటు కోసం ఆ పార్టీ కార్పొరేటర్లు కూడా ఆశపడుతున్నారు. ముషీరాబాద్ నుంచి నలుగురు బీజేపీ కార్పొరేటర్లు ఉండగా, వారిలో ఇద్దరు ఈ సీటును ఆశిస్తున్నారు. వారిపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. వారిని గెలిపించి తప్పు చేశామని ప్రజలు వాపోతున్నారు. ముషీరాబాద్ మళ్లీ బీఆర్ఎస్కే దక్కుతుందని స్పష్టం చేస్తున్నారు. ఆ పార్టీ అభ్యర్థి ముఠా గోపాల్ మరోమారు ఎమ్మెల్యే కావడం పక్కా అని జోస్యం చెబుతున్నారు.