బెజ్జూర్, మార్చి 20 : నిరుపేద యువతుల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని కొందరు దళారులు పెళ్లి పేరిట వారిని పక్క రాష్ర్టాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నట్టు తెలిసింది. నిరుడు జూలైలో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలానికి చెందిన ఇద్దరు యువతులు ఉపాధి కోసం మంచిర్యాల జిల్లాకు వెళ్లగా అక్కడ మహారాష్ట్ర, మంచిర్యాలకు చెందిన ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. పెళ్లి చేస్తామని నమ్మించి ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు తీసుకెళ్లి, వారి వద్దనున్న సెల్ఫోన్లు తీసుకొని విక్రయించినట్టు తెలిసింది.
అప్పటి నుంచి వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో అనుమానం వచ్చిన యువతుల కుటుంబసభ్యులు సెప్టెంబర్‌లో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిసింది. మంచిర్యాల జిల్లా కిష్టంపేటకు చెందిన అనుమానిత దంపతులు ప్రశాంత్, సవితతో పాటు మహారాష్ట్రలోని సిరోంచకు చెందిన మహేశ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన మరో నిందితుడు రాహుల్ కోసం వెతుకుతున్నట్టు సమాచారం. గతేడాది జూన్‌లో ఆసిఫాబాద్ జిల్లాలో ఇదే తరహా ఘటన జరగడం గమనార్హం. అంతర్గతంగా విచారణ జరుగుతున్నదని, ఒక మండల స్థాయి అధికారిపై వేటుపడనుందని సమాచారం.