హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఖాళీలను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో 3,000 ఖాళీల భర్తీ కోసం సంస్థ ప్రతిపాదన ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఎన్నికల కోడ్ ముగిశాక అది సీఎం పరిశీలనకు వెళ్తుంది. దానికి ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించడంపై సీఎం నుంచి ఎలాంటి అభ్యతరం వ్యక్తం కాకపోతే నియామకాలు జరుగుతాయి. దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకాలను ఆర్టీసీనే సొంతంగా చేపడుతున్నది. ప్రభుత్వ సంస్థల్లో అన్నిరకాల నియామకాలను టీఎస్పీఎస్సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.