హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): ఎయిర్పోర్ట్ మెట్రోకు జనరల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్గా సిత్రా-ఫ్రాన్స్, రైట్స్-భారతీయ రైల్వేలు, డీబీ ఇంజినీరింగ్-జర్మనీ సంస్థలను (కన్సార్టియం) ఎంపిక చేసినట్టు హైదరాబాద్ మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం ఐదు అంతర్జాతీయ సంస్థలు పోటీపడగా, మూడు ఎంపికైనట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సేవలను అందించేందుకు రూ.98.54 కోట్లు కోట్ చేశారని, పోటీలో పాల్గొన్న ఇతర సంస్థలకన్నా ఇది తకువ అని తెలిపారు.
ప్రజా రవాణా రంగంలో మెట్రో రైళ్ల నిర్వహణలో విశేష అనుభవం గల సంస్థలుగా అవి పేరుగాంచాయని, సిత్రా నేతృత్వంలో కన్సార్టియం విజేతగా నిలిచిందని పేర్కొన్నారు. మెట్రో రైల్వేలోని పలు విభాగాల్లో నిష్ణాతులైన 18 మంది ఇంజినీరింగ్ నిపుణులు, క్షేత్రస్థాయిలో మరో 70 మంది సీనియర్ ఇంజినీర్లు, సిబ్బంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో నిర్మాణంలో భాగస్వాములు కానున్నారని తెలిపారు.