హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో గుర్తింపు లేకుం డా కొనసాగుతున్న నకిలీ క్లినిక్స్‌పై శుక్రవారం దాడులు నిర్వహించినట్టు డీసీఏ డైరెక్టర్ జనరల్ కమలాసన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా రూ.3.45 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కాప్రా సర్కిల్లో లైసెన్స్ లేకుండా కొనసాగుతున్న మెడికల్ షాపును సీజ్ చేసి, రూ.30 వేల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పెద్దపల్లిలో ఫెర్రోస్ అస్కోర్బేట్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, మంచిర్యాలలో హెమాటినిక్ విత్ జింక్ అండ్ విటమిన్స్ టాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లో కేంద్రం బ్యాన్ చేసిన ఎల్-అర్జిన్ +సిల్డెనాఫిల్ డ్రగ్ కాంబినేషన్, హిమాచల్‌లోని బ్రాడ్ ఇంజక్టబుల్స్, తహ్లివాల్తో పాటు ఎల్-ప్రాన్జ్-సిడ్-సాఫ్ట్‌జెల్ క్యాప్సల్స్ అనే కాంబినేషన్, హర్యానాకు చెందిన ఫార్మాకాన్ గైనకాలజీ కేర్ తయా రీ చేసిన మందులను సీజ్ చేశారు. నకిలీ క్లినిక్‌లు, లైసెన్స్ లేని మెడికల్ షాపులు, నకిలీ మందుల తయారీ గురించి టోల్‌ఫ్రీ నంబర్ 18005996969కు ఫోన్ చేయాలని డీజీ సూచించారు.