హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): అత్యాధునిక, అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన ‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రాజేంద్రనగర్‌లో రూ.7 వేల కోట్లతో 14,652 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ విత్తన ల్యాబ్‌ను నిర్మించారు. ఇటీవలే ఈ ల్యాబ్‌కు స్విట్జర్లాండ్ వేదికగా కొనసాగే అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ గుర్తింపు లభించింది. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేం ద్రంగా తెలంగాణ ల్యాబ్ నిలిచింది. ఈ ల్యాబ్ దేశంలోనే అతిపెద్దది. సాంకేతికపరంగా, పరీక్ష విధానాలపరంగా కూడా ఈ ల్యాబ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ల్యాబ్‌లో విత్తనాల డీఎన్ఏ, విత్తనాల మొలకశాతం, తేమశాతం, భౌతిక స్వచ్ఛత, జన్యు స్వచ్ఛత వంటి అనేక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తనాలకు పరీక్ష నిర్వహించి ఎగుమతి చేసే అవకాశం లభించనున్నది. ఈ ల్యాబ్ ప్రారంభం తెలంగాణ విత్తనరంగంలో మైలురాయిగా నిలుస్తుందని విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తెలిపారు.