హైదరాబాద్ సిటీబ్యూరో/బొల్లారం, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మద్రాస్ రెజిమెంట్‌లో చోటుచేసుకున్న తుపాకుల చోరీ ఘటనపై ఒకవైపు మిలిటరీ, మరోవైపు పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నది. ఈ ఘటనకు పాల్పడింది ఇంటి దొంగలేనన్న అనుమానంతో పలువురిని దర్యాప్తు సంస్థలు విచారించినట్టు తెలిసింది. అత్యంత భద్రంగా ఉండే కంటోన్మెంట్ నుంచి తుపాకులు చోరీ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, దేశ భద్రతతో ముడిపడి ఉన్న అంశం కావడంతో దీనిని రక్షణ శాఖ కూడా సీరియస్‌గా తీసుకున్నది. ఈ ఘటనపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలో ఆరా తీశారని తెలుస్తున్నది. ఘటన జరిగి మూడు రోజులవుతున్నా కేసులో స్పష్టమైన పురోగతి లభించకపోవడంతో అటు మిలిటరీ వర్గాలు, ఇటూ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
అత్యంత అధునాతనమైన ఆయుధాలు చోరీకి గురికావడం, అవి ఎలాంటి శక్తుల చేతుల్లోకి వెళ్లాయనేది ఇప్పుడు ప్రధాన ఆందోళనగా మారింది. ఆ ఆయుధాలు కంటోన్మెంట్ ప్రాంతం దాటి బయటకు వెళ్లి ఉండకపోవచ్చని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఈ ఆయుధాలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించే సంఘవిద్రోహ శక్తుల చేతికి, అంతర్గత విద్రోహ ముఠాల చేతికి చిక్కితే తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కట్టుదిట్టమైన భద్రత, సైనిక నిఘా ఉండే ప్రదేశంలోకి బయటి వ్యక్తులు నేరుగా వెళ్లి ఆయుధాలు దొంగిలించడం అసాధ్యమని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. చోరీ జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరా పనిచేయకపోవడంతో పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆధారాలను దర్యాప్తు సంస్థలు సేకరించాయి. దీంతో 30వ తేదీ రాత్రి చోరీ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో తిరిగిన వాహనాల నంబర్లు, అనుమానితులను గుర్తించి వారిని విచారిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే 12 మంది అనుమానితులను విచారణ చేసినట్టు తెలుస్తున్నది. ఈ ఘటనపై మిలిటరీ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది.
మద్రాస్ రెజిమెంట్‌కు చెందిన మందుగుండు, ఆయుధాలు నిల్వ చేసిన గదిలో 30వ తేదీ రాత్రి 6 గంటల వరకు అన్ని సక్రమంగానే ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆ గది వద్దకు వచ్చిన సిబ్బంది గది తాళాలు పగులగొట్టి ఉన్నట్టు గుర్తించి, అందులో ఉన్న తుపాకులు, మందుగుండు సామగ్రిని పరిశీలించడంతో చోరీ జరిగిన విషయం బయటపడింది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘటనగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే అక్కడ విధులు నిర్వర్తించే వారు, సిబ్బంది మధ్య ఇటీవల గొడవలు, మనస్పర్థలు జరిగాయా? అనే అంశాలను దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయి. ఆయుధాలు నిల్వ ఉంచే గది వద్దకు అనుమానంగా అంతకుముందు రోజుల్లో వచ్చి పోయినవారిని కూడా పోలీసులు గుర్తించి విచారణ చేశారు.
ఇందులో భాగంగానే ఈ ఘటనకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టినట్టు తెలిసింది. 12 మందిని విచారించగా వారిలో నలుగురి కదలికలు అత్యంత అనుమానాస్పదంగా ఉండటంతో వాళ్లలోనే ఈ ఘటనకు పాల్పడినవారు ఉంటారని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు, ఆయుధాలు కంటోన్మెంట్‌తోపాటు పరిసర ప్రాంతాలు దాటి బయటకు వెళ్లవనే ధీమాతో దర్యాప్తు సంస్థలున్నాయి. ఇందులో భాగంగానే అనుమానం ఉన్నచోట దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ ఘటన దేశ భద్రతకు సంబంధించింది కావడంతో తాము ఎవరితోనూ కేసు విషయం మాట్లాడలేమని, ఏదైనా సమాచారం ఉంటే మిలిటరీ వారినే అడుగాలని మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ తెలిపారు. ఏదైనా సమాచారం ఉంటే ప్రెస్‌మీట్‌లోనే వెల్లడిస్తామని చెప్పారు. ఈ ఘటనతో కంటోన్మెంట్ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ ఘటన జరిగిన తరువాత ఆయుధాలు, మందుగుండు సామగ్రి రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని 16 మార్గాలను మూసివేసి, ఆంక్షలు విధించారు.