హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన అంటూనే ప్రశ్నించే హక్కును సైతం కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదనేందుకు ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తున్నది. మైనార్టీ గురుకుల సొసైటీ సెక్రటరీ తాజాగా జారీ చేసిన సర్క్యూలర్ తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. సొసైటీ సిబ్బంది భావప్రకటన స్వేచ్ఛను హరించేలా ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్గత విషయాలను బయటకు చెప్తే చట్టపరపరమైన చర్యలు తీసుకుంటామంటూ బెదింపులకు దిగారు. మైనార్టీ గురుకుల సొసైటీకి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొసైటీ ప్రధాన కార్యాలయంలో మంజూరు లేని పోస్టుల్లో ఇష్టారీతిన పలువురు ప్రైవేట్ వ్యక్తులను నియమించడంతోపాటు, లక్షల జీతాలు చెల్లిస్తున్నారు. అదీగాక ప్రమోషన్లు, డిప్యుటేషన్లను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ సిబ్బందిపై పూర్తిగా ప్రైవేట్ పెత్తనమే కొనసాగుతున్నదని సొసైటీ ఉద్యోగవర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పలువురు కోర్టులను కూడా ఆశ్రయించారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ప్రభుత్వ పెద్దలకు సైతం ఫిర్యాదులందాయి. సొసైటీలో అవినీతి అక్రమాల వెనక ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న ఓ మైనార్టీ నాయకుడే ఉన్నాడని సొసైటీ వర్గాలు మండిపడుతున్నాయి. ఉద్యోగులు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి విచారణా లేదు.
ఆరోపణలను నోటిమాటగా ఖండించడం తప్ప సొసైటీ ఉన్నతాధికారులు కూడా ఎలాంటి గణాంకాలను వెల్లడించడం లేదు. అవినీతి ఆరోపణలకు సంబంధించి ఇటీవల ‘నమస్తే తెలంగాణ’తోపాటు పలు పత్రికలు సైతం వరుస కథనాలు ప్రచురించాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకుండా పోయింది. కథనాలు రావడంతో సొసైటీ ఉన్నతాధికారులు దిగువ స్థాయి సిబ్బందిని బెదిరింపులకు గురిచేయడం ప్రారంభించారు. ప్రధాన కార్యాలయంతోపాటు, సొసైటీలోని కొందరు రెగ్యులర్ సిబ్బంది, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ సిబ్బంది మీడియాకు సమాచారం అందిస్తున్నారని ఉన్నతాధికారులు గరమవుతున్నారు.
వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బెదిరింపులకు దిగుతూ సెక్రటరీ ఏకంగా ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీ మీద తప్పుడు వార్తలు రాయిస్తున్నారని, అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని అప్పటికప్పుడు తొలగిస్తామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. సొసైటీ కార్యకలాపాలపై గోప్యత పాటించాలని, మీడియా ప్రతినిధులతో, బయటవారితో ఎలాంటి సమాచారం పంచుకోకూడదని ఆదేశించారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్ఎల్సీలు, గురుకుల ప్రిన్సిపాళ్లు, ప్రధాన కార్యాలయ సిబ్బందికి సర్క్యులర్ జారీ చేశారు. సెక్రటరీ తీరుపై సొసైటీ వర్గాలు మండిపడుతున్నాయి. అవినీతి ఆరోపణలు వస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా, వార్తలు వస్తున్నాయని తిరిగి బెదిరింపులకు దిగడమేంటని ప్రశ్నిస్తున్నాయి.