Somajiguda | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ) : దేశంలోని మహానగరాల్లో మెరుగైన షాపింగ్ అనుభూతిని అందించే అత్యుత్తమ హైస్ట్రీట్ మార్కెట్లలో హైదరాబాద్‌లోని సోమాజిగూడ రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో బెంగళూరులోని మహాత్మా గాంధీ (ఎంజీ) రోడ్డు అగ్రస్థానంలో ఉన్నట్టు ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘నైట్‌ఫ్రాంక్’ బుధవారం తాజా నివేదికలో ప్రకటించింది. దేశంలోని 7 మెట్రో నగరాల్లో సర్వే నిర్వహించి ‘థింక్ ఇండియా థింక్ రిటైల్-2023 హైస్ట్రీట్ రియల్ ఎస్టేట్ ఔట్లుక్’ పేరుతో ఈ నివేదికను వెల్లడించింది.
షాపింగ్‌కు సోమాజిగూడ అత్యంత అనుకూలంగా ఉన్నదని, ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు స్థానిక రిటైల్ వ్యాపారులు కల్పిస్తున్న పార్కింగ్ వసతులు, ఇతర సౌకర్యాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నది. ఇటీవల రిటైల్ వ్యాపార రంగంలో పోటీతత్వం విపరీతంగా పెరిగిందని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు మంచి షాపింగ్ అనుభూతిని కలిగించడం ఎంతో కీలకంగా మారిందని, అలాంటి అనుభూతి కలిగించే వీధులను హైస్ట్రీట్లుగా గుర్తిస్తారని వివరించారు.