హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : బాసర ఆర్జీయూకేటీలో ప్రవేశాలు పొందడంపై సర్కారు బడి పిల్లలు ఇక నుంచి ఆశలు వదులుకోవాల్సిందేనా? ఈ విద్యాసంస్థలోని అత్యధిక సీట్లను ప్రైవేట్ స్కూల్ విద్యార్థులే ఎగరేసుకుపోనున్నారా? అంటే పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. పదో తరగతిలో గ్రేడింగ్ విధానం ఎత్తివేయడం, మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఇదే జరగనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. బాసర ఆర్జీయూకేటీ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాతక విద్యాసంస్థ. దీన్ని అత్యధికంగా గ్రామీణ నిరుపేద, ప్రతిభావంతుల కోసమే ఏర్పాటు చేశారు. ఇందులో చేరిన వారికి ఆరేండ్లపాటు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సును ఉచితంగా అందిస్తున్నారు. ఇటీవల జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) ఉద్యోగాల భర్తీలో 100 మంది ఉద్యోగాలు సాధించారు.
ఇది వరకు పదో తరగతిలో గ్రేడెడ్ యావరేజ్ పాయింట్స్(జీపీఏ) ఆధారంగా బాసర ఆర్జీయూకేటీలో సీట్లు కేటాయించేవారు. సర్కారు బడుల్లో చదివిన వారికి అదనంగా నాలుగు పాయింట్లు కలపడంతో సీట్లు దక్కించుకునేవారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి పదో తరగతిలో గ్రేడింగ్ విధానాన్ని సర్కారు ఎత్తివేసింది. ఇక నుంచి 600 మార్కులకు విద్యార్థులు ఎన్ని మార్కులు సాధిస్తే అన్ని మార్కులే వేస్తారు. దీంతో సర్కారు స్కూళ్లల్లో చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరగనున్నది. ఈ విద్యాసంస్థలోని సీట్లను ఇక నుంచి ప్రైవేట్ విద్యార్థులే ఎగరేసుకుపోయే ప్రమాదం ఉన్నది.
పదో తరగతిలో ఒకటి, మూడు లాంగ్వేజెస్లో 92-100 మార్కులు, హిందీలో 90-100 మార్కులొస్తే గ్రేడింగ్ విధానంలో 10 గ్రేడ్ పాయింట్లు ఇచ్చేవారు. దీంతో సగటున 91, 92 మార్కులొచ్చినా 10 పాయింట్లు వచ్చేవి. కానీ ఇప్పుడు 90, 92 చొప్పున ఎన్ని మార్కులొస్తే అన్ని మార్కులే కేటాయిస్తారు. గ్రేడింగ్ విధానంలో 92 మార్కులొచ్చిన వారికి 10 గ్రేడ్ పాయింట్లతోపాటు అదనంగా 0.4 పాయింట్లు కలిపితే సర్కారు పాఠశాలల్లోని విద్యార్థులకు లాభం జరిగేది. కానీ ఇప్పుడు మార్కుల విధానంలో 92 మార్కులొచ్చిన వారు అక్కడే అగిపోనుండగా, 0.4 శాతం పాయింట్లు కలిపినా 100 మార్కులు రావడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే ప్రైవేట్లో 98, 99, 100 మార్కులొచ్చిన వారే సీట్లు ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. దీంతో సర్కారు స్కూళ్లల్లోని వారికి తీరని అన్యాయం జరగనున్నది. కేవలం సర్కారు పాఠశాలల్లోని విద్యార్థులకు సీట్లు కేటాయించేలా ప్రభుత్వం కొత్త పాలసీని రూపొందించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.