అది అత్యంత రద్దీ మార్కెట్.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అప్పుడే టిప్‌టాప్‌గా తయారై వచ్చిన వ్యక్తులు ఓ బంగారం దుకాణంలోకి ఎంటరయ్యారు. జేబులోంచి ఐడీ కార్డులు తీసి చూపిస్తూ.. ‘వుయ్ ఆర్ ఫ్రం ఐటీ.. మీ షాపులో బంగారం తనిఖీ చేయాలి’ అనడంతో భయపడ్డ సిబ్బంది ఉన్నదంతా తీసి ముందు పెట్టారు. ఇంకేం! లెక్కలు కరెక్టుగా లేవన్న ఆ వ్యక్తులు.. దాదాపు రెండు కిలోల బంగారంతో చెక్కేశారు. ఇదేంటి గ్యాంగ్ సినిమా స్టోరీ చెప్తున్నానని అనుకుంటున్నారా.. కాదండీ బాబూ..! హైదరాబాద్ నడిబొడ్డున శనివారం మిట్ట మధ్యాహ్నం చోటుచేసుకున్న దోపిడీ ఇది.
బేగంపేట్ మే 27: సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాట్ మార్కెట్లోని నవేర్ కాంప్లెక్స్‌లో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవన్ మధుకర్.. బాలాజీ జువెల్లరీ పేరుతో బంగారం షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఐటీ అధికారులమని గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు షాపులోకి వచ్చారు. గుర్తింపు కార్డులు చూపించారు. బంగారం తనిఖీలు చేయాలని ఆదేశించారు. సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేయసాగారు. 1,700 గ్రా ముల బంగారానికి సరైన ఆధారాలు లేవని చె ప్పారు. షాపు సిబ్బంది తమ యజమానితో మాట్లాడాలని సూచించారు. కానీ, వారు వినకుండా ‘బంగారం స్వాధీనం చేసుకుంటు న్నాం’ అని అక్కడి నుంచి బంగారంతో ఉడాయించారు. వెళ్లే క్రమంలో బయటడోరుకు గడియా పెట్టి వెళ్లారు. అందులో ఉన్న సిబ్బందికి అనుమానం వచ్చి కేకలు వేశారు. అప్పటికే దండగులు బంగారంతో వెళ్లిపోయారు. విషయం యజమానికి చెప్పడంతో ఆయన మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ చందనదీప్తి, ఏసీపీ రమేశ్, ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు ఘటనా స్థలానికి వచ్చి సీసీ టీవీ పుటేజీని పరిశీలించారు.
త్వరలోనే పట్టుకుంటాం: చందనాదీప్తి
ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్టు డీసీపీ చందనాదీప్తి తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ఒక్కో బంగారం బిస్కెట్ 100 గ్రాములు ఉంటుందని, మొత్తం 17 బిస్కెట్లు తీసుకెళ్లినట్టు గుర్తించామని వెల్లడించారు. షాపులోని సిబ్బంది అంతగా చదువుకోకపోవడంతో వచ్చింది అసలైన అధికారులా, నకిలీ అధికారులా అనేది గుర్తించలేకపోయారని తెలిపారు. దాంతో దుండగులు ఈజీగా బంగారాన్ని కొట్టివేసి వెళ్లిపోయారని అన్నారు. తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.