హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): పాపం ఎక్సైజ్ కానిస్టేబుళ్లు.. ఏ అధికారం లేని వేతన జీవులు. పైఅధికారి ఆదేశిస్తే పరుగెత్తడమే వారి పని. కానీ, నోరుతెరిచి ఎందుకు, ఎక్కడికి సార్? అని అడిగే అధికారం లేనేలేదు. పంచనామా చేసే పవర్ కూడా వారికి లేదు. అలాంటి ఎక్సైజ్ కానిస్టేబుళ్లపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కక్షసాధింపులకు దిగింది. ఒకేచోట పనిచేస్తే అక్రమాలు చేస్తారనే హిడెన్ ఆలోచనను మనసులో పెట్టుకొని 8ఎఫ్ అనే కఠిన నిబంధనను అమల్లోకి తెచ్చింది. మహిళలు అనే కనికరం లేకుండా బదిలీలు చేసింది. ఎందరినో జిల్లాలు దాటించి వందలాది కిలోమీటర్లు దూరంలో విసిరేసింది. కానీ ఏమైనా చేయడానికి అవకాశం, అధికారం ఉన్న గెజిటెడ్ స్థాయి అధికారులకు మాత్రం ఎటువంటి నియమ, నిబంధనలు లేకుండా ప్రభుత్వం పోస్టింగులు ఇచ్చింది. పవర్, పలుకుబడి ఉన్న ఉన్నతాధికారుల సర్వీస్ పోస్టింగులు మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే కొనసాగుతున్నాయి. ఇంకొద్దిగా అనుకుంటే మెదక్‌లోకి ఫోకల్ ప్రాంతాల చుట్టే తిరుగుతున్నాయి. రెండురోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం 68 మంది ఎక్సైజ్ ఉన్నతాధికారుల బదిలీలు చేసింది. వీరిలో కొంతమంది సర్వీస్, పోస్టింగ్‌లు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వివక్ష చూపుతున్నదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ఏ విజయాభాస్కర్రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా, ఇన్చార్జిగా డిప్యూటీ కమిషనర్, ఇన్చార్జి డీపీఈవోగా జిల్లాలో ఉన్న కీలక పోస్టులన్నీ ఒక్కడే గుత్త పట్టుకొన్నారు. ఇటీవల ఆయనకు ప్రమోషన్, పోస్టింగ్ వచ్చింది. కనీసం ప్రమోషన్ సమయంలోనైనా బదిలీ చేస్తారేమోనని చూస్తే స్థానచలనం చేయకుండా ప్రభుత్వం ఆయనకు అదే జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. స్వయంగా ఎక్సైజ్ మంత్రికి చెందిన జిల్లాలోనే ఇటువంటి పోస్టింగులు జరిగితే.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని బదిలీలలు జరిగి ఉంటాయే అంచనా వేసుకోవచ్చు అని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో అధికారి జే హరికిషన్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు. మొన్నటి దాకా సంగారెడ్డి కార్యాలయంగా మెదక్ డీసీగా పనిచేశారు. నిన్నటి బదిలీల్లో సైబరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ అధికారి గతంలో ఎస్టీఎఫ్ హైదరాబాద్, ఏసీ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి, ఏసీ హెడ్‌క్వార్టర్స్, సరూర్‌నగర్ డీపీఈవోగా బాధ్యతలు నిర్వహించారు. హరికిషన్ ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు హెడ్‌క్వార్టర్ పోస్టింగ్ తప్పనిసరి అని సర్దిచెప్తుండటం గమనార్హం. ప్రదీప్‌రావు హైదరాబాద్ ఎస్టీఎఫ్ నుంచి ఏసీగా ప్రమోషన్ పొందారు. ఈ అధికారి గతంలో మలాజిగిరి డీపీఈవోగా నాలుగేండ్లు, ఎస్టీఎఫ్లో మరో నాలుగేండ్లు చేశారు. తాజాగా మళ్లీ ఇప్పుడు మలాజిగిరి ఎన్‌ఫోర్స్‌మెంట్‌కే బదిలీ చేశారు. ఈ అధికారి గత మూడు పోస్టింగుల నుంచి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే విధులు నిర్వహిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే బాహాటంగా చెప్తున్నారు.
నాగర్‌కర్నూల్ డీపీఈవో ఉన్న డీ గాయత్రిని మెదక్ ఏసీ ఎన్ఫోర్స్మెంట్కు బదిలీ చేశారు. గతంలో ఈ అధికారి ఇదే పోస్టుకు ఏఈఎస్‌గా, సంగారెడ్డి జిల్లా సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తించారు. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రియ ఇదే హెడ్‌క్వార్టర్‌లోని అసిస్టెంట్ కమిషనర్‌గా డిస్టిల్లరీస్-2కు బదిలీ అయ్యారు. అసిస్టెంట్ కమిషనర్ ఎస్టీఎఫ్ ప్రణవి అదే హెడ్‌క్వార్టర్‌లో మలాజిగిరి డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. విజయభాసర్గౌడ్ వికారాబాద్ డీపీఈవో నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఈ అధికారి గతంలో మేడ్చల్ సూపరింటెండెంట్‌గా ఐదేండ్లు, రాజేంద్రనగర్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా నాలుగేండ్లు పనిచేశారు. మేడ్చల్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ హైదరాబాద్ ఎస్టీఎఫ్నకు బదిలీ అయ్యారు. ఈ అధికారి తకువ సర్వీసులోనే రెండు హైదరాబాద్ పోస్టింగులు చేస్తున్నారు. రంగారెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న జే జీవన్ కిరణ్‌ను సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బదిలీ చేశారు. ఈయన గతంలో చేసిన పోస్టింగులు సీఐగా తాండూరు, బాలానగర్ ఎస్‌హెచ్‌వోగా, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్పనిచేశారు. ఆయన సర్వీస్ మొత్తం రంగారెడ్డి చుట్టూనే చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఎస్ శ్రీనివాస్‌రెడ్డి వికారాబాద్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నుంచి ఫ్యూచర్ సిటీ సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యాడు. అదే ఫ్యూచర్‌సిటీలో ఉన్న వికారాబాద్‌కు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా ఆయన పనిచేస్తున్నారు. తాజాగా పేరు మార్చి ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఎస్ జానయ్య సూపరింటెండెంట్ కొత్తగూడెం నుంచి అదే ఉమ్మడి జిల్లాలో ఉన్న ఖమ్మం సూపరింటెండెంట్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ అధికారి సర్వీస్ మొత్తం ఖమ్మం జిల్లాలోనే చేయడం విశేషం. కే శ్రీనివాసరావు సంగారెడ్డి డీపీఈవోగా బదిలీ అయ్యారు. ఈయన అదే సంగారెడ్డి ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంటుగా, ఇన్చార్జి డీపీఈవోగా అక్కడే పనిచేస్తున్నారు. ప్రమోషన్ ఇచ్చి మళ్లీ అక్కడే పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం. గతంలో ఈయన పరిగి, హయత్‌నగర్‌లో పనిచేశారు.