Vijay Devarakonda | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులు చేస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ నుంచి విడుదలైన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్టర్‌ను చూసిన హీరో విజయ్ దేవరకొండ తనదైన స్టైల్లో స్పందించారు. ‘మైసా’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు. ఈ సందర్భంగా రష్మికను ఉద్దేశిస్తూ..“వైలెంట్ పిల్లా..! ఈ చిత్రంతో నీ అభిమానులు గర్వపడేలా చేస్తావు” అంటూ సరదాగా కామెంట్ చేశారు. విజయ్ చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రష్మికకు సంబంధించిన సినిమాలు, పోస్టర్లపై విజయ్ స్పందించిన ప్రతిసారీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి కనిపిస్తుంటుంది. ఇప్పుడు ‘మైసా’లో రష్మిక లుక్‌పై విజయ్ చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది.‘మైసా’లో రష్మిక ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. చిత్రబృందం విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లో ఆమె చేతిలో భారీ ఈటె పట్టుకుని, యుద్ధానికి సిద్ధమైన యోధురాలిలా కనిపిస్తున్నారు. ముఖంపై యుద్ధ గాయాలు, చుట్టూ మండుతున్న వాతావరణం, వెనుక భారీ జనసమూహంతో పోస్టర్‌ను ఎంతో ఇంటెన్స్‌గా రూపొందించారు. ఈ లుక్ చూస్తే సినిమాలో రష్మిక పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో అర్థమవుతోంది. ఇప్పటివరకు గ్లామర్, లవ్, ఫ్యామిలీ, యాక్షన్ వంటి విభిన్న పాత్రల్లో కనిపించిన రష్మిక.. ‘మైసా’లో మాత్రం పూర్తిగా కొత్త అవతార్‌లో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు తెలుస్తోంది.
రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్‌ఫార్ములా ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ డేట్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రష్మిక లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. సినిమాలో ఆమె పాత్ర, కథ నేపథ్యం, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇదిలా ఉంటే ‘మైసా’ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాకు సంబంధించి ఇంకా సుమారు 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. ఇటీవల సెట్స్‌లో ఓ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రష్మిక గాయపడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా ఆమె కొంతకాలం షూటింగ్‌కు దూరంగా ఉన్నారు. త్వరలోనే తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టి మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నవంబర్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు రష్మిక పాత్ర ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.