Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ షో గ్రాండ్‌గా ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్లు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీలతో పాటు కామనర్లకు కూడా అవకాశం ఇస్తున్నారనే వార్తలు ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ఆది రెడ్డి తాజాగా సీజన్ 10కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హౌస్‌లోకి వెళ్లే అవకాశం ఉన్న కంటెస్టెంట్ల జాబితాను కూడా ఆయన వివరించారు. ఆది రెడ్డి చెప్పిన లిస్ట్‌ను పరిశీలిస్తే.. ఈసారి సినీ నటులు, సీరియల్ ఆర్టిస్టులు, యాంకర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కామనర్లు ఇలా విభిన్న రంగాలకు చెందిన వారు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంలో సెకండ్ హీరోగా నటించిన అదిత్ ఈశ్వరన్ పేరు ఈ లిస్ట్‌లో ఉంది. యంగ్, ఫిట్‌గా ఉండే అదిత్ ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు ఓ సూపర్‌హిట్ సినిమాలో భాగమై గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ నుంచి వచ్చిన మంచి రెమ్యునరేషన్ ఆఫర్‌తో ఆయన ఈ షోలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు సమాచారం. కామనర్‌గా ‘అగ్నిపరీక్ష’ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన రోహిత్ కూడా బిగ్ బాస్ 10లో కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా పరిచయమైన కృష్ణుడు కూడా ఈ జాబితాలో ఉన్నారు. గతంలో కాస్త బరువు ఎక్కువగా కనిపించిన ఆయన ప్రస్తుతం బరువు తగ్గి ఫిట్‌గా మారారు. అమాయకమైన వ్యక్తిత్వం, మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తిగా కృష్ణుడికి ఇండస్ట్రీలో గుర్తింపు ఉంది. కృష్ణుడికి ఇటీవలి కాలంలో అవకాశాలు తగ్గాయి. దీంతో బిగ్ బాస్ వేదిక ద్వారా మరోసారి ప్రేక్షకులకు దగ్గర కావాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ లిస్ట్‌లో శాలిని పేరు కూడా ఆసక్తిని పెంచుతోంది. ఆమె బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే అవకాశం 95 శాతం ఉందని ఆది రెడ్డి అంచనా వేసారు.ఒకవేళ ఆమె ఎంట్రీ ఇవ్వకపోతే ఆమె స్థానంలో అపూర్వను తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం కూడా ఉంది. బిగ్ బాస్ సీజన్ 10లో అత్యంత క్రేజ్ ఉన్న పేర్లలో ముఖేష్ గౌడ ఒకరని చెప్పొచ్చు. ‘గుప్పెడంత మనసు’ సీరియల్లో ‘రిషి’ పాత్రలో కాలేజీ ఓనర్‌గా, మరోవైపు ‘రంగా’ పాత్రలో ఆటో డ్రైవర్‌గా నటించి తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో భారీ అభిమానులను సంపాదించుకున్నారు.ఇక ‘జబర్దస్త్’ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.
ఆది రెడ్డి చెప్పినట్లు ప్రచారంలో ఉన్న జాబితాలో మరికొంత మంది పేర్లు కూడా ఉన్నాయి.
టెంపర్ వంశీ – ‘టెంపర్’ సినిమా ఫేమ్ క్యారెక్టర్/విలన్ ఆర్టిస్ట్.
సృష్టి వ్యాకరణం – మోడల్, ఫిట్నెస్ ఫ్రీక్.
ఆర్జే చరణ్ – ‘అగ్నిపరీక్ష’ ఆర్జే, ఎంటర్టైనర్.
వర్షిణి సౌందరరాజన్ – ప్రముఖ యాంకర్, నటి.
జాన్సీ – రైతు, సింగర్; ‘అగ్నిపరీక్ష’ ద్వారా నేరుగా ఎంపికైన కంటెస్టెంట్‌గా ప్రచారం.
నరేష్ – ‘జబర్దస్త్’ నరేష్, పొట్టి నరేష్‌గా గుర్తింపు.
దేబ్జానీ మోదక్ – సీరియల్ నటి, ‘కుక్ విత్ జాతిరత్నాలు’ ఫేమ్.
చైత్ర రాయ్ – ప్రముఖ సీరియల్ నటి.
నవరసాలు ఆర్కే – ‘అగ్నిపరీక్ష’ కామనర్ కంటెస్టెంట్.
సుధీర్ రెడ్డి – పోడ్కాస్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.
ఆది రెడ్డి చెప్పిన లిస్ట్ ప్రకారం చూస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో కంటెస్టెంట్ల ఎంపిక చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉన్న సీరియల్ నటులు, సినీ నటులు ఉండగా.. మరోవైపు ‘అగ్నిపరీక్ష’ వంటి కార్యక్రమాల నుంచి వచ్చిన కామనర్లకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఈ పేర్లలో ఎంతమంది నిజంగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెడతారనే దానిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.