హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ సొసైటీ అదనపు కార్యదర్శి హన్మంత్ నాయక్‌పై ప్రభుత్వం వేటు వేసింది. సచివాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఇటీవల సొసైటీలో జరిగిన బదిలీలు, పదోన్నతులు వివాదాస్పదమవడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. హన్మంత్‌నాయక్ ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి కాగా, డిప్యూటేషన్‌పై గురుకుల సొసైటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్, టెండర్లు తదితర కీలక విభాగాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల బదిలీలు, పదోన్నతులు వివాదాస్పదంగా మారాయి. ఆయనపై ఆరోపణలు చేస్తూ ఏకంగా పలు సంఘాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయి, పలు సమీక్షా సమావేశాల సందర్భంగా డిప్యూటీ సీఎం హన్మంత్ నాయక్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. అడ్మిషన్లపై కూడా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆయనపై గుర్రుగా ఉన్నారట. సీట్లు ఖాళీగా ఉన్నా ఇవ్వడం లేదని ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో హన్మంత్ నాయక్‌పై వేటు పడిందని సొసైటీలో చర్చించుకుంటున్నారు.
ఇద్దరికి మించి పిల్లలున్నా పోటీకి అర్హులే?
హైదరాబాద్, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా పోటీ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిం ది. ఈ మేరకు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసింది. ఈ చట్ట సవరణ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉన్నదని సమాచారం. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి ఇప్పటివరకు పోటీ చేసే అవకాశం లేకుండా గతంలో చట్టంచేశారు. కొంతకాలంగా వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వారికి కూడా పోటీచేసే అవకాశం కల్పించాలని సర్కారు నిర్ణయించింది. దీనిపై అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ కానున్నాయి.