ముషీరాబాద్, ఫిబ్రవరి 5: అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామన్న బీజేపీ.. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి హామీ నిలబెట్టుకోవాలని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేస్తే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సోమవారం విద్యానగర్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాదిగల చిరకాల కోరికైన ఎస్సీ వర్గీకరణను కేంద్రం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్ధిని చాటుకోవాలని కోరారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకులు గణేశ్, రాందాస్, వరలక్ష్మి, కొల్లూరి వెంకట్, ప్రవీణ్, రమేశ్, శివకుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.