హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలోని వివిధ ప్రాంతాల్లో అజ్ఞాత జీవితం గడుపుతున్న తెలంగాణకు చెందిన మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలా వచ్చే వారికి ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ ఇన్చార్జి, డివిజినల్ కమిటీ సభ్యురాలు సావిత్రి అలియాస్ మాధవి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సావిత్రి భర్త, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ 2019లో మరణించారని, 2021లో ఆమె కొడుకు రావుల శ్రీ కాంత్ లొంగిపోయాడని తెలిపారు. భర్త మరణం తరువాత పార్టీ తనకు తగిన ప్రాధా న్యం ఇవ్వకపోవడంతో ఆమె లొంగిపోయారని పేర్కొన్నారు.
లొంగిపోయిన అనంతరం సావిత్రి అనేక కీలక విషయాలను వెల్లడించినట్టు తెలిపారు. సావిత్రి చెప్పిన ప్రకారం.. ఎంతోమంది సీనియర్ నాయకులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారు కనీసం నడిచే పరిస్థితిలో కూడా లేరని డీజీపీ చెప్పారు. పార్టీలో లొంగిపోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్నప్పటికీ, అగ్రనాయకత్వానికి భయపడి ముందుకు రావడం లేదని ఆమె చెప్పారని వెల్లడించారు. సావిత్రి ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారైనప్పటికీ, తెలంగాణలో లొంగిపోయినందున తక్షణ సాయం కింద రూ.50 వేలు అందజేస్తున్నామని, భవిష్యత్తులో నిబంధనల మేరకు ఆర్థికసాయం చేస్తామని స్పష్టంచేశారు. తెలంగాణ మావోయిస్టు రాష్ట్ర కమిటీకి ఇన్చార్జిగా చంద్రన్న కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉన్నదని తెలిపారు. రాష్ట్ర కమిటీలో తెలంగాణ వారి కంటే ఇతర రాష్ర్టాల వారే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. మావోయిస్టు కేంద్ర కమిటీలోని మొత్తం 20 మందిలో 11 మంది తెలంగాణ, ఇద్దరు ఏపీకి చెందినవారని పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా చింతకుప్ప గ్రామానికి చెందిన రావుల సావిత్రి 13వ ఏటనే కుంట ఏరియాలో మిలీషియా సభ్యురాలిగా చేరారు. 1992లో కుంట దళంలో చేరారు. కుంట ఏరియాలో పరిచయమైన రామన్నను వివాహమాడారు. 1998లో కి ష్టారం ఏరియా కమిటీ ఇన్చార్జిగా, 2008లో సౌత్బస్తర్లో డివిజినల్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తర్వాత సౌత్ బస్తర్ డివిజన్ ఇన్చార్జిగా పనిచేస్తూ లొంగిపోయారు. క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘటన్, దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్‌సంఘ్, చైతన్య నిత్య మంచ్ నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. 1992 నుంచి 2021 వరకు పోలీసులపై జరిగిన వివిధ భారీ దాడుల్లో ఆమె పాల్గొన్నట్టు డీజీపీ వెల్లడించారు. సమావేశంలో శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఎస్ఐబీ ఎస్పీ భాస్కర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.