కురవి, అక్టోబర్7 : రాష్ట్ర ముఖ్యమంత్రి అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి(CM Revanth) మరిచిపోయాడని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే భాష మారడం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్(Sathyavathi Rathod) అన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉండి కళ్లు పీకుతా.. కొడుకుల్లారా.. గోలీలు ఆడుకుంటా.. ఇటువంటి చౌకబారు మాటలకు(Cheap talk) సీఎం రేవంత్ రోల్‌మోడల్‌గా నిలిచాడన్నారు. ముఖ్యమంత్రి పదవి గౌరవం రోజురోజుకూ తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం ప్రజల్లో బీఆర్ఎస్, మాజీ సీఎం కేసీఆర్ ప్రాబల్యం తగ్గాలని సీఎం రేవంత్‌రెడ్డి అపసోపాలు పడుతున్నారన్నారు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని.. కేసీఆర్‌ను తట్టుకోలేమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శిఖండిల్లా మహిళా మంత్రులను ముందుపెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయాలు హుందాతనంగా చేయాలని హితవు పలికారు. రైతుబంధు, రైతు రుణమాఫీ, నెలకు రూ. 2500, ఇలా చెప్పు కుంటూ పోతే ఎన్నో పథకాలు అమలుకావడం లేదన్నారు. పరిపాలనను గాలికి వదిలేస్తే మిమ్మల్ని ప్రజలు మిమ్మల్ని వదలిపెట్టరని హెచ్చరించారు.