ఇచ్చోడ, ఏప్రిల్ 21: తెలంగాణ సర్కారు. సీఎం కేసీఆర్ సహకారంతో ముక్రా (కే) గ్రామం అభివృద్ధిలో అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతున్నది సర్పంచ్ మీనాక్షి గాడ్గె వెల్లడించారు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన నేషనల్ పంచాయతీరాజ్ అవార్డు సెమినార్లో ఆమె మాట్లాడారు. గ్రామంలో నాలుగేండ్లలో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదుకాలేదని చెప్పారు. వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇంకుడుగుంతలతో మురుగు కాలువల్లో నీరు నిల్వడం లేదని, గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో లక్ష మొక్కలు నాటి వందశాతం రక్షిస్తున్నట్టు వివరించారు. పల్లె ప్రగతిలో భాగంగా తీసుకొన్న ట్రాక్టర్, ట్రాలీ ద్వారా గ్రామంలో రోజూ తడి, పొడి చెత్తను సేకరిస్తున్నామని తెలిపారు.
చెత్తతో వర్మికంపోస్ట్ తయారు చేస్తున్నామని, ఇప్పటివరకూ దీనిని విక్రయించగా రూ.7 లక్షల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఇందులోనుంచి రూ.4 లక్షలతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ, పాఠశాల, వీధి బల్బులు, అంగన్వాడీ, వాటర్ ప్లాంట్‌కు కనెక్షన్ ఇచ్చామని తెలిపారు. దీంతో పంచాయతీకి నెలకు వచ్చే కరెంట్ బిల్లు రూ.10 వేలు అదా అవుతున్నదని వివరించారు. రూ.2 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని, గ్రామంలో నర్సరీ, వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, పల్లె ప్రకృతివనం, బృహత్ పార్కు, క్రికెట్ గ్రౌండ్, న్యూట్రీ గార్డెన్, సాముహిక మరుగుదొడ్లు, ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.
ప్రతి వీధిలో సీసీ కెమెరా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలోని ముక్రా (కే) గ్రామపంచాయతీ అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్ సహాయ మంత్రి కపిల్ పాటిల్ ప్రశంసించారు. దేశంలో 2లక్షల 50 వేల గ్రామపంచాయతీలు అవార్డులకోసం పోటీపడగా 41 జీపీలు మాత్రమే ఎంపికయ్యాయని, అందులో ముక్రా(కే) ఒకటిగా నిలువడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడ్గె మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు. సెమినార్లో కేంద్ర పంచాయతీరాజ్ సెక్రటరీ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.