నల్లగొండ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని.. మంత్రి జగదీష్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యేగా చిరుమర్తి లింగయ్య మూడో సారి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ మూడు రోజుల ‘మొక్కు బడి యాత్ర’ను చేపట్టారు. మొదటి రోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని, కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా సంజయ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే సీఎం కేసీఆర్ సారథ్యంలో, పర్యవేక్షణలో యాదాద్రి దేవాలయాన్ని తిరుపతి దేవస్థానానికి దీటుగా సకల సౌకర్యాలతో అద్భుతంగా నిర్మించారన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి నాయత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యేగా మూడో సారి చిరుమర్తి లింగయ్య గెలుపును ఎవరు ఆపలేరని పేర్కొన్నారు.
దేవుడి అనుగ్రహం, ప్రజల ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్రభుత్వం మూడో సారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి రాజు,పెద్ద నరసింహ, అనుమోజు వెంకటాచారి, శ్రీకాంత్, సత్యనారాయణ, బైరు మంగమ్మ, ఉమ, తండా శోభ, తదితరులు పాల్గొన్నారు.