Tollywood | చాలా రోజుల తర్వాత తెలుగు బాక్సాఫీస్ ఈ వారం సందడిగా మారనుంది. మైథలాజికల్ విజువల్ స్పెక్టాకిల్ ‘నాగబంధం’, సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’తో పాటు పలు ఆసక్తికరమైన తెలుగు, హిందీ, హాలీవుడ్ చిత్రాలు జూలై తొలి వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం.
యంగ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, ‘కేరాఫ్ కంచరపాలెం’ దర్శకుడు వెంకటేశ్ మహా తెరకెక్కించిన సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా ‘రావు బహదూర్’పై మంచి అంచనాలు ఉన్నాయి. దీప థామస్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ఈ వారంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చాయి. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 3న ఈ విజువల్ వండర్ విడుదల కానుంది.
ప్రముఖ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘బేబీ డూ డై డూ’ కూడా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. చెవిటి, మూగ మహిళ పాత్రలో హుమా నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. నచికేత్ సమంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో రూపొందిన తొలి మహిళా ప్రధాన యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ కూడా ఇదే వారంలో విడుదల కానుంది. ఆలియా భట్, శర్వరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో జూలై 3న థియేటర్లలోకి రానుంది.
పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు ఇల్యూమినేషన్ స్టూడియోస్ నిర్మించిన యానిమేటెడ్ కామెడీ చిత్రం ‘మినియన్స్ అండ్ మాన్స్టర్స్’ జూలై 1న విడుదల కానుంది. మినియన్స్ సిరీస్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి వినోదాన్ని అందించనుంది.
మొత్తంగా చూస్తే జూలై తొలి వారంలో యాక్షన్, మైథలాజికల్, సైకలాజికల్ డ్రామా, సస్పెన్స్ థ్రిల్లర్, యానిమేషన్ వంటి విభిన్న జానర్లలో సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలుస్తుందో చూడాలి.