గద్వాల టౌన్, జూన్ 4 : ‘జీతాలు చేసేందుకు పైసలు అడుగుతున్నడు.. పైసలు ఇచ్చినా పనిచేయడంలేదు.. ఎందుకు చేయడంలేదంటే దుర్భాషలాడుతున్నడు.. వేతనాలు రాక.. లంచాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నాం.. మీరే న్యాయం చేయాలి’.. అంటూ సీనియర్ అసిస్టెంట్‌పై శానిటరీ ఇన్చార్జి ఇన్స్పెక్టర్, జవాన్లు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య విభాగానికి సంబంధించిన జవాన్లు, పారిశుద్ధ్య విభాగం శానిటరీ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ బుధవారం సీ-1 సెక్షన్ సీనియర్ అసిస్టెంట్‌ను కలిశారు. వేతనాల చెల్లింపుల్లో ఎందుకు ఆలస్యమవుతున్నదని, జీతాల్లో కోత ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు.
దీంతో వీరిమధ్య గొడవ చోటుచేసుకోవడంతో సిబ్బంది సర్దిచెప్పారు. ఈ క్రమంలో జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి నివాసానికి చేరుకుని సీనియర్ అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేసి, అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లారు. ఫైల్స్ ముందుకు కదలాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, కొన్ని సార్లు పైసలు, మద్యం బాటిళ్లు ఇచ్చినట్టు తెలిపారు. అయినా మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జీతాలు ఇవ్వకపోవడంతో విసిగిపోయి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. సదరు సీనియర్ అసిస్టెంట్‌ను ఫోన్లో వివరణ కోరగా.. తాను ఎవరినీ డబ్బులు అడగలేదని, నిబంధనల మేరకే వేతనాల చెల్లింపు ఫైల్స్‌ను క్లియర్ చేస్తున్నామని తెలిపారు.