బషీరాబాద్, మార్చి 24 : వికారాబాద్ జిల్లా, బషీరాబాద్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. అడ్డొచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టి పారిపోయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున కొర్విచేడ్ గని గేట్ సమీపంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. బషీరాబాద్ ఎస్సై శ్రీశైలంయాదవ్ తాండూరు పోలీస్ సబ్ డివిజన్లో పెట్రోలింగ్ ముగించుకుని, కానిస్టేబుల్ రమేశ్, డ్రైవర్‌తో కలిసి బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న క్రమంలో కొర్విచేడ్ గని గేట్ సమీపంలో రెండు ఇసుక ట్రాక్టర్లు తారసపడ్డాయి. పోలీస్ వాహనాన్ని గమనించిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్లను కొర్విచేడ్ గ్రామంలోకి పోనిచ్చింది. దీంతో పోలీసులు ట్రాక్టర్లను వెంబడిస్తూ గ్రామంలోకి వెళ్లారు. పోలీస్ వాహనాన్ని గమనించిన ఇసుక మాఫియా తమ టాక్టర్లను మళ్లీ మెయిన్‌రోడ్డుపైకి తీసుకెళ్లింది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించే క్రమంలో పోలీస్ వాహనాన్ని ఇసుక ట్రాక్టర్లు ఢీకొట్టాయి.
దీంతో పోలీస్ వాహనం ముందు భాగం నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న ఎస్సై, కానిస్టేబుల్, డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డారు. వారు తేరుకునేలోపు ఇసుక ట్రాక్టర్లో మాఫియా ముఠా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయింది. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరా తీయగా దామర్చేడ్ గ్రామానికి చెందిన సురేశ్, నంధ్యానాయక్తండాకు చెందిన శ్రీనివాస్ ట్రాక్టర్లుగా తేలాయి. దీంతో పోలీసులు వారి ఇండ్లకు వెళ్లి విచారించగా అప్పటికే ఓనర్లు, డ్రైవర్లు తప్పిచుకుని వెళ్లినట్టు తెలిసింది. ఇసుక మాఫియా ఇంతగా రెచ్చిపోతున్నా అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని మండల ప్రజలు వాపోతున్నారు. కొంతమంది పోలీసులు మమూళ్ల మత్తుకు అలవాటు పడి ఇసుక అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటున్నారు.