Assigned Lands | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : భూమిలేని నిరుపేదల బతుకుదెరువు కోసం ప్రభుత్వం ఇచ్చేది అసైన్డ్ భూమి. ఇందులో వ్యవసాయం చేసుకొని ఆ కుటుంబం జీవనం సాగించేందుకు అన్ని విధాల హక్కులు ఉంటాయి. అనుభవించి ఫలాలు పొందడం తప్ప వాటిని విక్రయించే అధికారం సదరు రైతుకు ఉండదని రెవెన్యూలోని అసైన్డ్ చట్టం స్పష్టంచేస్తున్నది. దీన్ని ఉల్లంఘిస్తే అసలుకే మోసం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ అసైన్డ్ భూములను ఇతరులకు అప్పగిస్తే.. దాన్ని సాకుగా చూపి పీవోటీ కింద నేరుగా స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. మరోవైపు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ భూములను అభివృద్ధి చేస్తే ఆ మేరకు వచ్చే వాటాపై సదరు రైతులకు సంపూర్ణ హక్కు ఉంటుంది. విక్రయించుకునే వెసులుబాటు సైతం కలుగుతుంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రయోజనాల కోసం తమ భూములను కార్పొరేట్ల పరం చేసి మొదటికే మోసం తెచ్చుకోవద్దని, ప్రభుత్వపరంగా అభివృద్ధికి ఇచ్చి వచ్చిన వాటాను సంతృప్తిగా అనుభవించడం శ్రేయస్కరమని రెవెన్యూ నిపుణులు సూచిస్తున్నారు.
ఆశచూపి కంపెనీల ఒప్పందాలు
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 92లో ఉన్న సుమారు 300 ఎకరాల లావణి పట్టా భూములపై ఓ కంపెనీ కన్నేసి అనధికారిక ఒప్పందం చేసుకోవడం.. దాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తేవడంతో ఇప్పుడు అసైన్డ్ భూములపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా నగర శివారులో అనేక కంపెనీలు ఈ భూములపై కన్నేశాయి. సాధారణ పట్టా భూములైతే ధర ఎక్కువ ఉంటుంది. కానీ అసైన్డ్ భూములైతే రైతులు వాటిని విక్రయించుకునే వెసులుబాటు లేదు. దీంతో ఆ రైతుల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని కార్పొరేట్ కంపెనీలు ఈ భూములపై గద్దల్లా వాలుతున్నాయి. అప్పటికప్పుడు లక్షల ఆశచూపి.. అనధికారిక ఒప్పందాలు చేసుకుంటున్నాయి. రికార్డులు మారిన తర్వా త మిగతాది ఇస్తామంటూ నమ్మబలుకుతున్నాయి. ఈ క్రమంలోనే నాదర్గుల్ పరిధిలోనూ ల్యాండ్‌పూలింగ్ కోసం అనధికారిక ఒప్పందాలు జరిగాయి.
వాస్తవానికి పెద్దపెద్ద కాలనీల మధ్య ఉండిపోయిన నాదర్గుల్లోని 290 ఎకరాల ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం తగ్గిపోయింది. ప్రభుత్వ భూములు కావడంతో రైతులు వీటిని విక్రయించుకునే హక్కులేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో పరస్పర ప్రయోజనకరంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ప్రభుత్వం అనుకుంటే పీవోటీ కింద రైతుల నుంచి బలవంతంగా తీసుకుని సర్కార్ ల్యాండ్ బ్యాంక్‌లో జమ చేయవచ్చు. కానీ కేసీఆర్ ప్రభుత్వం అలా కాకుండా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ చేయాలని భావించింది. అప్పటి అధికారులు సైతం ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు ఎకరాకు అభివృద్ధి చేసిన ప్లాట్లను 500 గజాల చొప్పున ఇస్తామని ప్రతిపాదిస్తే.. రైతులు వె య్యి గజాలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎకరాకు 700 గజాల వరకు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలిసింది. కానీ అదే సమయంలో ఎన్నికలు రావడం.. ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. వాస్తవానికి ప్రతిపాదన అమల్లోకి వచ్చి ఉంటే రైతులకు సంపూర్ణ హక్కులతో వందల గజాల ప్లాట్లు చేతికొచ్చేవి. అక్కడ ఉన్న రేటు ప్రకారం గజానికి రూ.50-60 వేల వరకు ధర పలికేవి. రైతులకు ప్రయోజనం కలిగేది.
కార్పొరేట్‌తో రెంటికి చెడ్డ రేవడిలా పరిస్థితి..
అసైన్డ్ భూములను చేజిక్కించుకునేందుకు కార్పొరేట్ కంపెనీలు అనేక హైడ్రామా నడిపిస్తాయి. రైతులకు వెంటనే లక్షల రూపాయలు చేతుల్లో పెట్టి వారిలో ఆశను రేకెత్తిస్తాయి. ఆపై ఒక్కసారి ఒప్పందం పూర్తయిన తర్వాత రైతుల జుట్టు కంపెనీల చేతుల్లోకి వెళ్తుంది. ఈ విషయం బయటికి పొక్కితే రెవెన్యూ శాఖ అప్రమత్తమవుతుంది. అనధికారిక ఒప్పందాలు భూమిలోకి కార్పొరేట్ కంపెనీ వచ్చి కార్యకలాపాలు చేపట్టడాన్ని ఆధారంగా చేసుకొని అసైన్డ్ చట్టం ప్రకారం అధికారులు నోటీసులు జారీ చేస్తారు. అనంతరం పీవోటీ కింద ఆ భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది. దీంతో రైతుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారవుతుంది.
మరోవైపు కొంతకాలం పాటు కార్పొరేట్ కంపెనీలు తమ పలుకుబడితో రెవెన్యూ శాఖ చర్యలు తీసుకోకుండా నిలువరించినా అభివృద్ధి చేసిన తర్వాత సదరు కంపెనీ తన వాటా ప్లాట్లను విక్రయించుకొని పోతుంది. ఆపై దానిపై కొర్రీలు మొదలైతే రైతుల చేతుల్లో ఉన్న ప్లాట్లపై వివాదం నెలకొంటుంది. దీంతో వాటిని విక్రయించుకునే పరిస్థితి ఉండదు. నాదర్గుల్ పరిధిలోనూ ల్యాండ్‌పూలింగ్ కోసం జరిగిన అనధికారిక ఒప్పందాలు ఈ కోవకే వస్తాయని, ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ, ప్రభుత్వం దృష్టి పెడితే రైతులపై కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నదని, ఇలాంటి ప్రైవేట్ ల్యాండ్ పూలింగ్ వ్యవహారాల్లో తలదూర్చకుండా ప్రభుత్వపరంగా ల్యాండ్ పూలింగ్ చేయిస్తే అన్ని కోణాల్లోనూ రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని రెవెన్యూ నిపుణులు వివరిస్తున్నారు.