హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు కౌలు రైతులకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని వక్తలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. కౌలు రైతుల కోసం ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో బుధవారం కౌలు రైతులతో ధర్నా నిర్వహించారు. ప్రొఫెసర్ హరగోపాల్, ఆంధ్రజ్యోతి మాజీ ఎడిటర్ కే శ్రీనివాస్, సామాజిక కార్యకర్త రుక్మిణీరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్ తదితరులు ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2011 చట్టంప్రకారం కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలను జారీ చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్, కే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు.
కౌలు రైతును గుర్తించి రైతు బీమా, రైతు భరోసా, బ్యాంకు రుణాలు, పంట నష్టపరిహారాన్ని వర్తింపజేయాలని కోరారు. ఐకేపీ, సీసీఐ కేంద్రాల్లో పంటలు అమ్మితే భూ యజమానుల ఖాతాల్లో డబ్బు లు వేస్తున్నారని, దీంతో కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుంటున్నదని విమర్శించారు. ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకోకపోతే మళ్లీ రైతాంగ ఉద్యమాలు తీవ్రరూపం దాలుస్తాయని, దానికి పాలకులే బాధ్యత వహించాలని స్పష్టంచేశారు. రాష్ట్రం లో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల్లో 70 శాతానికి పైగా కౌలు రైతులే ఉంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్త డాక్టర్ రుక్మిణీరావు, రైతుసంఘం నాయకులు ప్రసాదరావు, పీ జంగారెడ్డి, ఎస్కేఎం కన్వీనర్లు పశ్య పద్మ, విస్సా కిరణ్, కొండల్, వీ ప్రభాకర్, ఆర్ వెంకటరాములు, పీ రమేశ్, ఐలయ్య తదితరులు ప్రసంగించారు.
రుణ విముక్తి కల్పించండి
ఎనిమిదేండ్లుగా ఐదెకరాల భూమిని కౌలుకు సాగు చేస్తున్నా. మూడెకరాల్లో పత్తి, రెండెకరాల్లో వరి సాగుచేస్తున్నా. వర్షాలు మంచిగా పడితే పంటలు పండుతాయి. కొన్నేండ్లుగా పండిన పంటలు కౌలుకే సరిపోతున్నాయి. సొంత భూమి లేదు. ఇళ్లు కూడా చిన్నదే. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తించి, రుణ విముక్తి కల్పించి ఆదుకోవాలి.
– లావణ్య, కనగల్, చేగుంట మండలం, సిద్దిపేట జిల్లా
విత్తనాలు, ఎరువుల సబ్సిడీ ఇవ్వాలి
తొమ్మిదేండ్లుగా ఐదెకరాలు కౌలుకు చేస్తున్నాం. ఎకరానికి రూ.15 వేల చొప్పున రూ.75 వేలు పంట వేయడానికి ముందే రైతుకు చెల్లిస్తాం. పంట పండినా, పండకపోయినా కౌలు చెల్లించాల్సిందే. ఐదెకరాల్లో పత్తి, మక్క, కంది పంటలు సాగు చేస్తున్నాం. ప్రభుత్వం కౌలు రైతుగా గుర్తించి, రుణ సౌకర్యం కల్పించాలి. విత్తనాలు, ఎరువుల సబ్సిడీ అందించాలి.
-యాదమ్మ, చిలీపురం, పూడూరు మండలం, వికారాబాద్ జిల్లా
అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నాం
రెండెకరాల్లో పత్తి పంట వేశాను. సీసీఐలో ఆ పంటను అమ్ముకోవాలంటే పాసుబుక్ కావాలన్నరు. పట్టేదారుల పాస్‌బుక్ కావాలంటే రూ.100 నుంచి రూ.300 వరకు కమీషన్ అడుగుతున్నారు. పెట్టుబడి సాయం కోసం ప్రైవేటు అప్పులు తీసుకోవాల్సి వస్తున్నది. అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నం.
– బండి మల్లేశ్, ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లా
మాకూ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి
కౌలుకు భూమి తీసుకొని పంటలు పండిస్తున్న మాకూ సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఏడేండ్లుగా 15 ఎకరాల పొలాన్ని కౌలుకు సాగు చేస్తున్నా. పంటను ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవడం వల్ల చాలా నష్టపోతున్నా. ప్రభుత్వమే ఆదుకోవాలి.
– రాసం నర్సింహ, ఆదిలాబాద్