Fourth City | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 24 (నమస్తే తెలంగాణ): అవి మారుమూలన రాళ్లు, గుట్టలు, ఏనెలతో నిండిన భూములు.. తొండలు కూడా గుడ్లుపెట్టని నేలలు.. అందుకే దశాబ్దాల కిందట ప్రభుత్వాలు ఆ భూములను భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకునేందుకు ఇచ్చాయి. దశాబ్దాలుగా ఆ రైతులు తమ కండల్ని కరిగించి, వాటిని చదును చేసుకుని సాగు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ భూములకు దశ తిరిగింది. పాలకులు ప్రకటిస్తున్న ఫోర్త్ అలియాస్ ఫ్యూచర్ సిటీలు ఆ భూముల పక్కనే వెలుస్తున్నాయి. సర్కారు పెద్దలు గీస్తున్న ట్రిపుల్ఆర్ రింగులు.. గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వాటి సమీపంలో నుంచే దూసుకుపోనున్నాయి. మరి.. పడావు పడిన ఆ భూముల్లో ఇప్పుడు సిరులు పండి పేదోళ్లు పెద్దోళ్లు కావాలి. అదే జరిగితే బ్రహ్మాండం బద్దలై… భూమి-ఆకాశం ఏకమవుతుంది కదా. అందుకే ఆ విపత్తు రాకుండా పెద్దోళ్లు రంగంలోకి దిగారు.
పేదోళ్ల చేతుల్లో భూములను మాయం చేస్తున్నారు. అడ్డికి పావుసేరులా అనధికారికంగా కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒకటీ అరా కాదు సుమా! గత నాలుగైదు నెలల్లోనే వందల ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములను కొందరు పెద్దలు బినామీ పేర్లతో పాటు సూట్‌కేస్ కంపెనీల పేరిట చెరపడుతున్నారు. ఒకవైపు హైదరాబాద్‌లో రియల్ రంగం వెలవెలబోతూ, హైడ్రా బుల్డోజర్లు హడావుడి చేస్తుంటే.. మరోవైపు పాలకులు ప్రకటించిన ఫోర్త్ సిటీ పరిధిలో మాత్రం నిబంధనలకు పాతర వేస్తూ పేదోళ్ల భూముల్లో పెద్దలు వాలిపోతున్నారు. ఇందుకు సర్వీసులో ఉన్న వారితో పాటు పదవీ విరమణ పొందిన పలు శాఖల ఉన్నతాధికారులూ అతీతం కాకపోవటం శోచనీయం.
గత 9 నెలలుగా రాష్ట్రంలో రియల్-నిర్మాణ రంగం కుదేలైందని సర్వేలు ఘోషిస్తున్నాయి. ట్రై సిటీల్లో ఒక్క మెగా నిర్మాణ ప్రాజెక్టు మొదలైన దాఖలాలు లేవు. ఇక్కడ రియల్-నిర్మాణ రంగం దివాలా తీస్తే.. ఫోర్త్ సిటీలో మాత్రం అనధికారిక రియల్ రంగం మాత్రం జోరు మీదున్నది. గత నాలుగైదు నెలలుగా గుట్టుగా సాగుతున్న ఈ భూ దందాలో పేదోళ్ల భూములన్నీ పెద్దోళ్ల పరం అవుతున్నాయి.
కొందరు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే అసైన్డ్ భూముల కొనుగోళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నట్టు ఆరోపణలున్నాయి. తొలుత గ్రామంలోని ఒకరిద్దరు బ్రోకర్లను రంగంలోకి దింపి.. రోడ్డువైపున ఉన్న అసైన్డ్ భూముల వారిని మచ్చిక చేసుకుంటున్నారు. వారికి కొంత రేటు ఎక్కువ ఇచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే దాని వెనక భూముల వారిని బ్రోకర్లు సంప్రదిస్తున్నారు. వీరికి తక్కువ ధర చెప్తున్నారు. ఎవరైనా రైతులు ఇవ్వబోమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు తెలిపారు. దీంతో తప్పని పరిస్థితుల్లో అమ్ముకోవాల్సి వస్తున్నదని రైతులు వాపోయారు. ఈ ప్రక్రియ 99 ఏండ్ల లీజు ఒప్పందంపై చేస్తున్నారు. అనంతరం రెవెన్యూ కార్యాలయాల్లో ఆ సర్వే నంబర్‌కు సంబంధించిన రికార్డులను మాయం చేస్తున్నట్టు సమాచారం. ఇందులో కొన్ని ఏండ్లుగా పట్టాగా నమోదు అయ్యాయని చూపి.. దాన్ని ఆసరాగా చేసుకొని ఆ భూములన్నీ పట్టాగా మార్చేందుకు పావులు కదుపుతున్నారు.
ఈ భూమాయకు సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి : 91827 77711