హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మొండిచేయి చూపించిందని కార్మిక సంఘాల్లో తీవ్రఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారని ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్న తమకు క్యాబినెట్ సమావేశం నిరాశ మిగిల్చిందని ఉద్యోగులు, కార్మికులు మండిపడుతున్నారు. ఇటీవల సమ్మెకు పిలుపునిచ్చిన సమయంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా మాటలు చెప్పారని, అవన్నీ నీటిమూటలుగానే మిగిలిపోయాయని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆర్టీసీలో 3 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించడం దారుణమని, నియామకాలు తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 9న సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో ఆర్టీసీ అధ్వానంగా మారిందని కార్మిక సంఘాల నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకపోవడం, ఎన్నికల సమయంలో విలీనం ఆశచూపి, ఇప్పుడు ఆర్థిక భారం సాకుగా చూపడమేంటని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం బకాయిలను ప్రభుత్వం ఆర్టీసీకి సక్రమంగా చెల్లించడంలేదని మండిపడుతున్నారు. కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసేలా ఉద్యోగుల సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయడం దారుణమని, వీటిని రద్దు చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు.
క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, సమస్యల సమస్యల పరిష్కారం గురించి చర్చించకపోవడాన్ని నిరసిస్తూ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని కార్మిక సంఘాల జేఏసీలో నేతలు చెప్తున్నారు. ఈ మేరకు కార్యాచరణ ప్రకటించాలని, ఇందుకు సంబంధించి 9న సమావేశమై నిర్ణయాలు తీసుకుంటామని అంటున్నారు. నమ్మించి సమ్మెకు వెళ్లకుండా చేసిన సర్కారు.. యూనియన్ల ఉనికిని ప్రశ్నార్థకం చేసిందని నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు నిర్వహించనున్న సమావేశంపై ప్రాధాన్యత సంతరించుకుంది.