హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కోసం జూన్ 2న అపాయింటెడ్ డేట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 31న కార్మికులందరూ డిమాండ్ డే ( Demand Day) ను పాటించాలని ఆర్టీసీ జేఏసీ ( RTC JAC ) నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జేఏసీ నాయకులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కో-కన్వీనర్ బి.యాదగిరి మాట్లాడారు.
గత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి చర్యలు చేపట్టి శాసనసభలో బిల్లు కూడా పాస్ చేసిందని గుర్తు చేశారు. కేవలం విలీన తేదీని ప్రకటించాల్సిన సమయంలో ప్రభుత్వాలు మారాయని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ సమ్మె సందర్భంగా మంత్రులతో కూడిన ఉపసంఘం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయటానికి అధికారికంగా ప్రకటన చేశారని తెలిపారు.
ఇటీవల విలీనం కంటే ముందు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో కార్మికుల్లో తీవ్ర గందరగోళం నెలకొన్నదని అన్నారు. ఆర్టీసీ విలీనానికి అపాయింటెడ్ తేదీని తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2న ముఖ్యమంత్రి ప్రకటించాలని కోరుతూ మే 31 న సింగిల్ డిమాండ్ పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, యూనిట్లలో ఎర్ర బ్యాడ్జీలు ధరించి డిమాండ్ డే పాటించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు ఎం.ఎస్.అలీ, డి.గోపాల్, జె.రాఘవులు, బుద్ధ విశాల్, మనోహర్, ఎ.ఎస్.రెడ్డి, జనార్దన్, వెంకటయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.