హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో ఏటేటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది మరణిస్తున్నారు. కానీ టీఎస్ ఆర్టీసీ బస్సు ఎక్కిన ప్రయాణికులకు ఇప్పటికీ ఓ భరోసా ఉంటున్నది. సురక్షితంగా గమ్యస్థానం చేరుతామన్న నమ్మకం ఉంటది. అందుకే బస్సు ఎక్కగానే చాలామంది ఏ ఆందోళనా లేకుండా ఓ కునుకు తీస్తుంటారు. ఈ భరోసా, భద్రత ప్రైవేటు వాహన ప్రయాణాల్లో ఎక్కడా కనిపించదు. ఆర్టీసీలో సుశిక్షితులైన, సుదీర్ఘమైన అనుభవం ఉన్న డ్రైవర్లు ఉంటారు. అందుకే ప్రయాణికులు నిశ్చితంగా గమ్యస్థానాలు చేరుకొంటున్నారు. ప్రమాద సమయాల్లోనూ ఆటోలు, కార్లు, ఇతర వాహనాలతో పోలిస్తే బస్సుల్లో ఉన్నవారికి రక్షణ ఎక్కువ. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోజుకు 35.29 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. కొద్ది రోజులపాటు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తేనే ప్రైవేటు డ్రైవర్ల కారణంగా ఎన్ని ఇబ్బందులు వచ్చాయో ప్రజలకు అనుభవమే. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ప్రజారవాణా అందుబాటులో లేకుంటే మన భద్రత ప్రమాదంలో పడినట్టే. ఆర్టీసీ ప్రైవేటుపరమైతే అడ్డగోలు చార్జీల దోపిడీ తప్పదు. వాటిపై నియంత్రణ కష్టసాధ్యమే. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆర్టీసీని కాపాడుకోక తప్పదని ప్రజల్లో చర్చ మొదలైంది. బస్సు చార్జీల్లో స్వల్ప పెంపు మనపై భారం కాదని, ప్రజారవాణా వ్యవస్థను కాపాడుకొనే బాధ్యత అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కాలేజీకి వెళ్లటానికి పొద్దున్నే రోడ్డెక్కిన విద్యార్థి ఎదురుచూసేది ఆర్టీసీ బస్సుకోసమే. సగటు ఉద్యోగి పొద్దున్నే టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆర్టీసీ బస్సుకోసం బస్స్టాపులో నిత్యం నిలబడటం పరిపాటే. ఓ రైతు దగ్గరలోని పట్టణానికి వెళ్లి ఎరువులు, పురుగు మందులు తెచ్చుకోవాలంటే ఎర్రబస్సే దిక్కు. పల్లెల్లోని వేలమంది స్కూలు పిల్లలు పొద్దున్నే పుస్తకాల బ్యాగులు తగిలించుకొని ఎదురుచూసేది ఆర్టీసీ బస్సుకోసమే.. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆర్టీసీ బస్సే చోదకం. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీలకు నిత్యం వందల బస్సుల్లో వేలమంది విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. స్కూలు, కాలేజీ విద్యార్థులందరికీ ఆర్టీసీలో బస్సు పాసులు నామినల్ ఫీజులతోనే లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే స్కూలు పిల్లలకు బస్సుపాసులు పూర్తిగా ఉచితమే. కొన్నివర్గాల ఉద్యోగులకు 25 శాతం చార్జీలకే పాసులు జారీ చేస్తున్నారు. ఇలా ఎంతోమంది ఆర్థిక భారాన్ని ఆర్టీసీ మోస్తున్నది. ఆర్టీసీ లేకుంటే ప్రైవేటు వాహనాల దోపిడీకి అడ్డు ఉండదు. ప్రైవేటులో ఎవరికీ రాయితీలు ఉండవు. ఆ పరిస్థితే వస్తే ముందుగా ప్రభావితం అయ్యేది పల్లెల్లోని పేద విద్యార్థులు. ఆర్టీసీ బస్పాసులు ఉండటం వల్లనే ఎంతోమంది విద్యార్థులు రోజూ స్కూలుకు వెళ్తున్నారు. అవే లేకుంటే వారు బడి మానేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.