హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో త్వరలో కారుణ్య నియామకాలు చేపట్టే ఆలోచన ఉన్నదని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఆర్టీసీలో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు వారి విద్యార్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శనివారం బస్‌భవన్‌లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌తో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీపై మంచి చర్చ జరుగుతున్నదని అన్నారు. సిబ్బంది సైతం ఉత్సాహంగా పనిచేస్తున్నారని, ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ సంస్థను లాభాల బాటలో నడిపించాలని సూచించారు. కార్మికుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ, సిబ్బంది, అధికారుల సమిష్టి కృషితో నాలుగు నెలలుగా సంస్థ ప్రగతి బాటలో నడుస్తున్నదని చెప్పారు. సంస్థ అభివృద్ధిలో పునరంకితం అవుతామంటూ సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.