సారపాక, మే 12: ఆటో అడ్డురావడంతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-మోతెపట్టీనగర్ మధ్య ఆదివారం చోటుచేసుకుంది. మణుగూరు డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు (టీఎస్ 28 టీఏ 2219) 35 మంది ప్రయాణికులతో భద్రాచలం వెళ్తున్నది. సారపాక-మోతె పట్టీనగర్ గ్రామాల మధ్యలో ఓ కల్వర్టు వద్దకు రాగానే ఎదురుగా ఓ ఆటో అడ్డువచ్చింది. దీంతో అదుపు తప్పిన బస్సు పక్కనే ఉన్న కల్వర్టు కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు, 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ స్థానిక నాయకుడు, బూర్గంపహాడ్ సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను భద్రాచలం ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం దెబ్బతిన్నది.