సత్తుపల్లిటౌన్, జూలై 2 : ‘ఒకటికి నాలుగు రెట్లు డబ్బులు ఇస్తాం.. బ్లాక్ మనీని వైట్‌గా మారుస్తాం’ అంటూ అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న 12 మంది ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్‌రెడ్డి గత నెల 25న సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. దోపిడీ ముఠాలోని సభ్యుడు ఏదో ఒక నంబర్‌కు ఫోన్ చేసి తన పేరు మహేందర్‌రెడ్డి, బాలగంగాధర్, చంద్రం, చంటిబాబు అని ఒకొకరికి ఒక్కో పేరు చెప్పేవాడు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటానని, తన అకౌంట్లో రూ.2 కోట్ల బ్లాక్ మనీ ఉందని, ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్యలు ఉన్నాయని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చాలని చెప్పేవాడు. తనకు రూ.10 లక్షలు ఇస్తే.. రూ.40 లక్షలు ఇస్తానని మాయమాటలు చెప్పేవాడు. తన మాటలు నమ్మిన వారి వద్దకు తన మనిషిని ‘డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీ నోట్లు’ ఉన్న బ్యాగుతో పంపేవాడు. అవతలి వారు ఇచ్చిన ఒరిజినల్ డబ్బు లెకబెట్టే సమయంలో నకిలీ పోలీసులు కార్లలో వెళ్లి వారిని దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అని బెదిరించి నగదు ఎత్తుకెళ్లేవారు.
విశ్వసనీయ సమాచారం మేరకు.. ఈ డీల్ జరుగుతున్న జంగారంలో.. పోలీసులు రైడ్ చేశారు. ఏపీలోని ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన చంటిబాబు, సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన వర్ధన్ (బెటాలియన్ కానిస్టేబుల్), ఏలూరు జిల్లా టీనర్సాపురరానికి చెందిన సత్యనారాయణ, సత్తుపల్లి మండలం గంగారానికి చెందిన కేశవరావు (ఆర్ఎస్సై), ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మల్లాయిగూడెంకు చెందిన మారుముడి మధు (క్యాబ్ డ్రైవర్), వేంసూరు మండలం బీరపల్లికి చెందిన గౌతమ్‌కుమార్, నేలకొండపల్లి మండలం సదాశివపురానికి చెందిన నవీన్, సత్తుపల్లి మండలం తుంబూరుకు చెందిన నాగరాజు, అంబేదర్ కోనసీమ జిల్లా రావులపల్లి మండలం కొండగట్టుపల్లికి చెందిన సుబ్బరాజు, సికింద్రాబాద్ ఏఎస్రావునగర్కు చెందిన శ్రీనివాస్, కర్నూలు జిల్లా శ్రీకృష్ణనగర్‌కు చెందిన గణేశ్, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రాజేంద్రనగర్‌కు చెందిన జనార్దనరాజును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. రామాంజనేయలు, రాజు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ.17,60,000 నగదు, 3 కార్లు, సూటీ, 16 సెల్ఫోన్లు, పోలీస్ యూనిఫామ్, సంకెళ్లు, 80 బండిల్స్ రూ.500 డమ్మీ చిల్డ్రన్స్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్టు ఏసీపీ వివరించారు.