హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ మాజీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గౌలిదొడ్డిలోని గురుకుల పాఠశాలకు మూడున్నర నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గురుకులా ల్లో జరుగుతున్న పరిణామాలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్య పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
మాజీ సీఎం కేసీఆర్ పాలనలో ప్రపంచ స్థాయికి ఎదిగిన గురుకులాలు ఇప్పుడు మృత్యుకుహరాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేశారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, క్రీడా అకాడమీల్లో పనిచేస్తున్న ఫ్యాకల్టీకి మూడు నెలలు జీతాలు ఇవ్వకపోవడం అనేది పకాగా అభివృద్ధి చేసిన గురుకులాల మీద, దళిత వర్గాల మీద జరుగుతున్న అతి పెద్ద కుట్రగా పేర్కొన్నారు. గురుకుల ప్యాకల్టీ జీతాలు వెంటనే చెల్లించకపొతే ప్రజలు మరో తెలంగాణ గురుకుల పరిరక్షణ ఉద్యమానికి సిద్ధమవుతారని హెచ్చరించారు.