హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని, దివాలా తీసిందని చెప్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మిస్ వరల్డ్-2025 పోటీల కోసం ఏకంగా రూ.200 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు స్పష్టమవుతున్నది. ఇందులో వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలకే కాంగ్రెస్ సర్కారు ఏకంగా రూ.5.70 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు సమాచార హక్కు చట్టం (ఆర్టీఏ) ద్వారా తేలింది. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై ‘యూత్‌ఫర్ యాంటీ కరప్షన్’ తరఫున హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త పల్నాటి రాజేంద్ర ఆర్టీఏ ద్వారా ప్రశ్నించడంతో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు విస్తుగొలిపే నిజాలను వెల్లడించారు.
ఆర్టీఏ సమాధానం ప్రకారం.. మిస్ వరల్డ్-2025 పోటీల ప్రచారానికి సంబంధించిన ప్రకటనలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,70,05,993 ఖర్చు చేసింది. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు రూ.3,93,34,569, అవుట్డోర్ మీడియా ప్రకటనలకు రూ.1,67,06,424, ప్రింట్ మీడియా ప్రకటనలకు రూ.9.65 లక్షలు వెచ్చించింది. దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిధులు లేవంటూ ఉద్యోగులు, కాంట్రాక్టర్లకు వివిధ రకాల బిల్లులు, పెన్షనర్లకు ప్రయోజనాలు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, మెస్‌చార్జీలు నిలిపివేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. మిస్ వరల్డ్ పోటీల ప్రకటనల కోసమే రూ.5.70 కోట్లు ఖర్చు చేయడంపై ఏమి సమాధానం చెప్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
విందులో ఒక్కో ప్లేట్ భోజనం రూ.లక్ష
మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలకు ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్టు గతంలోనే ఆరోపణలు వచ్చాయి. ఈ విందులో ఒక్కో ప్లేట్ భోజనానికి ఏకంగా రూ.1 లక్ష చొప్పున చెల్లించినట్టు సమాచారం.
రూ.200 కోట్లు ఖర్చు?
మిస్ వరల్డ్-2025 పోటీలకు రూ.54 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు అబద్ధాలు వల్లించిన ముఖ్యమంత్రి, పర్యాటక శాఖ మంత్రి కలిసి మొత్తంగా రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ నిధులను దుబారా చేసినట్టు తెలుస్తున్నది. దీనిపై ప్రతిపక్షాలు, ప్రజలు ఇప్పటికే అనేకసార్లు నిలదీసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. మిస్ వరల్డ్ పోటీలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారని, వాటి లెక్కలను రూపాయల్లో చెప్పాలని ఆర్టీఏ కార్యకర్తలు దరఖాస్తు చేస్తే.. పర్యాటక శాఖ అధికారులు మాత్రం డాలర్లలో సమాధానమిచ్చి అందరినీ విస్మయానికి గురి చేశారు. దీంతో ఆర్టీఏ పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన టూరిజం అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని రాజేంద్ర హెచ్చరించారు.