జగద్గిరిగుట్ట, నవంబర్ 5: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్టలో (Jagadgirigutta) పట్టపగలు, నడిరోడ్డుపై ఓ రౌడీపై (Rowdy Sheeter) ప్రత్యర్థి రౌడీ హత్య చేశాడు. స్నేహితులైన ఇద్దరు రౌడీల మధ్య తలెత్తిన విభేదాలే హత్యకు కారణమని తెలుస్తున్నది. మేడ్చల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డినగర్‌కు చెందిన రోషన్‌సింగ్ (25) ఆటోడ్రైవర్. ఇతనిపై బాలానగర్ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉన్నది. జగద్గిరిగుట్టకు చెందిన రౌడీషీటర్ బాలశౌరిరెడ్డి (26)తో పరిచయం ఏర్పడి, స్నేహాంగా మారింది. కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలతోపాటు ఓ మహిళ విషయంలో ఏర్పడ్డ విభేదాలతో దూరం పెరిగింది.
ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం రోషన్‌సింగ్ అతని స్నేహితుడు మనోహర్‌తో కలిసి జగద్గిరిగుట్ట బస్టాప్‌లో ఉండగా.. బాలశౌరిరెడ్డి, అతని స్నేహితులు ఆదిల్, మహ్మద్‌తో కలిసి బుల్లెట్ బండిపై అక్కడికి వచ్చాడు. వీరిలో ఒకరు రోషన్‌సింగ్‌ను పట్టుకోగా… బాలశౌరి కత్తితో విచక్షణ రహితంగా పలుసార్లు పొడిచాడు. రోషన్సింగ్తో ఉన్న మనోహర్ పరుగులు తీశాడు. రోషన్‌సింగ్ తప్పించుకునే ప్రయత్నం చేసినా బౌలశౌరి వెంటాడుతూ మళ్లీ మళ్లీ దాడి చేశాడు. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి బైక్‌పై పరారయ్యాడు. నడిరోడ్డుపై దాదాపు పది నిమిషాలపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినా పోలీసులు ఎవరూ అక్కడికి రాకపోవడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని, గతంలో మాదిరిగా పెట్రోలింగ్, గస్తీలు కనిపించడంలేదని చెప్తున్నారు. ఘటనా స్థలాన్ని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి, ఏసీపీ నరేశ్‌రెడ్డి పరిశీలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రోషన్‌సింగ్‌ను గాంధీ దవాఖానలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.