హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ పునరుద్ధరణకు కుట్ర జరుగుతున్నదని తెలంగాణవాదులు, మేధావులు, పాత్రికేయులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఓ క్రమ పద్ధతిలో కుట్రకు ఆంధ్ర మీడియా తెరలేపిందని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా మీడియాలో సీమాంధ్రుల ఆధిపత్యం కొనసాగుతున్నదని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ అస్తిత్వం- సవాళ్లు, కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రముఖ పాత్రికేయుడు వేణుగోపాలస్వామి అధ్యక్షతన జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారు. తెలంగాణ రాజకీయ శక్తులను ఎదగనీయకుండా మీడియాను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తున్నారని చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే తెలంగాణ సెంటిమెంట్‌ను ముందుకు తెస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తున్నదని, తెలంగాణ ప్రభుత్వం రాజకీయ కక్షలపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు.
సీఎం ‘జై తెలంగాణ’ అనకపోవడం ఏంటి? ; దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రులు తమ రాష్ర్టానికి జై కొడతారని, మన రాష్ట్రంలో మాత్రం 18 నెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి ‘జై తెలంగాణ’ అనకపోవడమేంటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే ‘జై తెలంగాణ’ అనాల్సిన అవసరంలేదంటూ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. ‘జై తెలంగాణ’ నినాదంతో ఉద్యమం నాటి పోరాటాలు ప్రజల మదిలో మెదులుతాయనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ‘జై తెలంగాణ’ అనడంలేదని విమర్శించారు. గతంలో కాకతీయ తోరణం రాచరిక చిహ్నం అంటూ రేవంత్‌రెడ్డి హేళనగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల నుంచి ఎలాంటి డిమాండ్ రాకున్నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని తెలిపారు. తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తొలగించడం సీఎం రేవంత్‌రెడ్డి చేసిన పెద్ద అపచారమని నిప్పులుచెరిగారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నేడు కాంగ్రెస్ హయాంలో నిరాదరణకు గురవుతున్నదని చెప్పారు. వ్యాపార, వికృతకళలను గద్దర్ వ్యతిరేకించారని, కానీ నేడు విలువలు లేని సినిమాలకు ప్రభుత్వం గద్దర్ అవార్డులను ఇచ్చిందని దుయ్యబట్టారు.
తెలంగాణ అస్తిత్వంపై కుట్ర : నందిని సిధారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు
కేసీఆర్ బ్యాచ్ అని ముద్ర వేసి, కొంతమంది మేధావులను మాట్లాడకుండా చేస్తున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి తెలిపారు. కొంతమందికి తాయిలాలు ప్రకటించి, మరికొంత మందిని నామినేటెడ్ పోస్టుల లిస్టులో ఉంచి మాట్లాడకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునరుద్ధరణకు ప్రయత్నం జరుగుతున్నదని, ఈ చర్యల వెనుక స్పష్టమైన భావజాలం, కుట్ర దాగి ఉన్నాయని చెప్పారు. ఇప్పుడిప్పుడే తెలంగాణ-ఆంధ్ర భావన మర్చిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారని ఏబీఎన్ రాధాకృష్ణ తన వ్యాసంలో రాశారని, అయితే ఈ విషయంలో రాధాకృష్ణ, చంద్రబాబునాయుడు, రేవంత్‌రెడ్డి సంతోషంగా ఉంటారని విమర్శించారు. భారతదేశ చిత్రపటంలో నుంచి తెలంగాణను మాయం చేశారని, ఇదంతా జాగ్రత్తగా క్రమానుగతంగా జరుగుతున్నదని వివరించారు. ప్రాంతీయ చైతన్యంతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే, రాష్ర్టాన్నే దెబ్బతీసే కుట్ర జరుగుతున్నదని దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే ఈ కుట్రలు జరగుతున్నాయని వివరించారు.
రేవంత్ సర్కారును మేధావులు కాపాడుతున్నారు ; పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, సామాజిక విశ్లేషకుడు
కేసీఆర్ మీద కోపంతో కొందరు మేధావులు రేవంత్ సర్కారును కాపాడుతున్నారని సామాజిక విశ్లేషకుడు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పాలనలో లగచర్లలో గర్భిణిని కూడా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. లగచర్ల అంశం మీద మాట్లాడాలని మీడియావాళ్లు కోరితే ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడలేదని గుర్తుచేశారు. మహాన్యూస్ విషయంలో జరిగింది కేవలం ‘థంబ్నెయిల్లో పొరపాటు’ మాత్రమేనని ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ అనడమేంటని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారని తెలిపారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, ఏపీ మంత్రి లోకేశ్‌కు ఇచ్చిన భారతదేశ చిత్రపటంలో తెలంగాణను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై రచ్చ జరగగానే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఇచ్చిన మ్యాప్‌లో తెలంగాణ మ్యాప్ ఉన్నదని తెలిపారు. ఫేస్బుక్లో పోస్టులు పెట్టిన వ్యక్తులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కూర్చోబెడుతున్నారని చెప్పారు.
ఓటర్ల చేతిలో గెలుపోటములు లేవు ; మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్
దేశంలో ఎన్నికల నిర్వహణపై ఆందోళన నెలకొన్నదని కేంద్ర సమాచారశాఖ మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ చట్టాలనే ప్రభుత్వాలు మార్చేశాయని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఫిరాయింపు చట్టాలపై తీర్పులు గందరగోళంగా ఉంటున్నాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పులను ఎవరికి అనుకూలంగా వారు మలుచుకుంటున్నారని తెలిపారు. ఓటర్ల చేతిలో ప్రస్తుతం గెలుపోటములు లేవని, మీడియా చేతిలోకి ఫలితాలు వెళ్లిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యాంగం కూడా పాలసీ అయిందంటే పరిస్థితి ఎంతలా దిగజారిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఇంకా తెలుగు సినిమా అనడమెందుకు? ; చల్లా శ్రీనివాస్, ప్రముఖ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు
తెలంగాణ సచివాలయం, తెలంగాణ ఆర్టీసీ అని చెప్పుకుంటున్నప్పటికీ సినిమా రంగాన్ని మాత్రం తెలుగు సినిమా అని చెప్పడం ఎందుకని ప్రముఖ పాత్రికేయుడు, సినీ విమర్శకుడు చల్లా శ్రీనివాస్ ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేండ్లు అయినా తెలంగాణ సినిమా ఎందుకు రావడంలేదని అన్నారు. సంస్కృతి, కళారూపాలు ఉన్న ప్రతీచోట సినిమా ఊపిరి పోసుకుంటుందని, దేశంలో విజయం సాధిస్తున్న సినిమాలన్నీ ప్రాంతీయ చిత్రాలేనని తెలిపారు. మళయాళం వాళ్లు ఓటీటీని ఏలుతున్నారని ఉదహరించారు. గతంలో తెలంగాణలో దక్కన్ సినిమా ఉండేదని గుర్తుచేశారు.
పాటల రూపంలో తిరుగుబాటు రావాలి ; పాపారావు, ఆర్థిక నిపుణుడు
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనపై రాష్ట్రంలో పాటల రూపంలో తిరుగుబాటు రావాల్సిన అవసరముందని ఆర్థిక నిపుణుడు పాపారావు అభిప్రాయం వ్యక్తంచేశారు. సమిష్టి పోరాటాలే తెలంగాణకు ఉన్న విశిష్ట లక్షణమని చెప్పారు. రాష్ట్రం ఏర్పాటు కాకముందు సినిమాల్లో విలన్లతో తెలంగాణ యాసను మాట్లాడించారని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ దృక్పథం మారిందని తెలిపారు. తెలంగాణకు సైద్ధాంతిక పునాది ఉందని, దీన్ని జనాల్లోకి మరింత చేరువ చేయాలని సూచించారు.
హక్కులను కాలరాయడం జర్నలిజమా? ; వేణుగోపాలస్వామి, ప్రముఖ పాత్రికేయుడు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చారని, ఇటీవల రోశయ్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారని ప్రముఖ పాత్రికేయుడు వేణుగోపాలస్వామి తెలిపారు. తెలంగాణలో ఎంతో మంది వైతాళికులు ఉండగా రోశయ్య విగ్రహం పెట్టడం సరికాదని చెప్పారు. తెలంగాణలోని పథకాలకు ఇందిరాగాంధీ పేరు పెట్టడమేంటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలన్నీ ప్రజావ్యతిరేకంగా ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో విలువలు పతనం కోసం ఆంధ్ర మీడియా పని చేస్తున్నదని, ప్రజల హక్కులను కాలరాయడం జర్నలిజం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
పాలించేది ఒకరు.. నడిపించేది ఒకరు ; గోరటి వెంకన్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
రాష్ట్రంలో పాలన చేసేది ఒకరు.. వాళ్లను నడిపించేది ఒకరు అని ప్రజాగాయకుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న తెలిపారు. రాష్ట్రంలో ఏదో ఒత్తిడికి పాలన సాగుతున్నదని చెప్పారు. తెలంగాణలో బహుళ అస్తిత్వాలు ఉన్నాయని, ప్రజలు ఏండ్లుగా ఆధిపత్యాలను ధిక్కరిస్తూ వస్తున్నారని తెలిపారు. ఏయే ఆకాంక్షల కోసం తెలంగాణ ఉద్యమం చేశామో.. వాటిని కనుమరుగు చేసే కుట్ర జరుగుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజాసంస్కృతి ఉన్నదని వివరించారు. హెచ్‌సీయూలో లక్షల చెట్లను నిర్దాక్షిణ్యంగా కొట్టేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్లలో ఫార్మా ఫ్యాక్టరీ ప్రతిపాదనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రిమోట్‌తో కంట్రోల్ చేస్తున్నారు ; సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ సాహిత్య విమర్శకుడు
కొంతమంది రిమోట్ కంట్రోల్ ద్వారా తెలంగాణను నియంత్రిస్తున్నారని ప్రముఖ సాహిత్య విమర్శకుడు సంగిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మత సామరస్యానికి పేరొందిన హైదరాబాద్‌లో మతవిద్వేషాలు పెంచి పోషిస్తున్నారని చెప్పారు. ఓ చానల్‌పై దాడి చేస్తామంటూ కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్ అనడమేంటని ప్రశ్నించారు. ఎన్నో దాడులను తట్టుకుని తెలంగాణను సాధించామని, తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తే ప్రజలు స్పందిస్తారో లేదో అనే చూద్దామనే ప్రయత్నాలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. సచివాలయం వద్ద ఉన్న తెలుగుతల్లి ఫ్లైఓవర్‌కు తెలంగాణ తల్లి అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.