హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ దివంగత కొణిజేటి రోశయ్య ఇంట్లో విషాదం నెలకొన్నది. రోశయ్య జీవిత భాగస్వామి శివలక్ష్మి (86) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. సోమవారం తెల్లవారుజామున అమీర్‌పేటలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో కొణిజేటి కుటుంబంతోపాటు సన్నిహితుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 2021లో రోశయ్య మరణించిన తర్వాత ఆమె తన కుమారులు, కుటుంబ సభ్యులతో కలిసి అమీర్‌పేటలోని నివాసంలోనే ఉన్నారు. శివలక్ష్మి మరణ వార్త తెలియగానే వారి నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నేతలు శివలక్ష్మి పార్థివదేహానికి నివాళులర్పించారు. పార్టీలకతీతంగా రోశయ్య అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో శివలక్ష్మి వెన్నంటే ఉండి, కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారని స్మరించుకున్నారు.