హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ అగ్నిప్రమాద ఘటనలో క్యూనెట్ సంస్థ పాత్రపై సమగ్ర విచారణ జరపాలని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, మోసపూరిత సంస్థల కదలికలపై ఈడీ లాంటి సంస్థలు నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
3 రోజుల క్రితం జరిగిన ఈ అగ్నిప్రమాదంలో క్యూనెట్‌లో పనిచేస్తున్న ఆరుగురు యువతీ, యువకులు మరణించిన విషయం విదితమే. ఈ దుర్ఘటనపై శనివారం సజ్జనార్ స్పందిస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. భారీగా డబ్బు ఆశచూపి యువతను మోసగిస్తున్న క్యూనెట్ బాగోతం ఈ అగ్నిప్రమాదంతో మరోసారి బయటపడిందని, అమాయకులైన ఆరుగురిని ఆ సంస్థ పొట్టనబెట్టుకున్నదని పేర్కొన్నారు. క్యూనెట్‌లో 40 మందికిపైగా యువత పనిచేస్తున్నట్టు తెలుస్తున్నదన్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూనెట్ లాంటి మోసపూరిత సంస్థల మాయలో పడొద్దని యువతకు సూచించారు.