హైదరాబాద్, మార్చి 15(నమస్తే తెలంగాణ): ప్రస్తుత, భవిష్యత్తు విద్యుత్తు అవసరాలను తీర్చుకునేందుకు పెద్ద ఎత్తున పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ రాష్ర్టానికి సూ చించింది. తెలంగాణలో కొత్తగా 7,917 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, 2035-36 నాటికి వీటిని సిద్ధం చేయాలని నిర్దేశించిం ది.
హైడ్రో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై సీఈఏ తాజాగా రోడ్‌మ్యాప్ విడుదలచేసింది. 2035-36 నాటికి దేశవ్యాప్తంగా పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ప్లాంట్ల సామర్థ్యాన్ని 100 గిగావాట్లకు చేర్చాలన్న ధ్యేయంతో సీఈఏ రోడ్‌మ్యాప్ ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను మినహయిస్తే ఇంకా 1,49,276 మెగావాట్ల ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ వాటా 7,917 మెగావాట్లు.
టీజీ జెన్కో సర్వే చేయించిన ప్లాంట్లు సీఈఏ నివేదికలో లేకపోవడంతో ఈ రెండింటి ప్రణాళికలు భిన్నం గా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఖమ్మం జిల్లా కల్లూరు లో 750, రంగారెడ్డి జిల్లా లోయపల్లిలో 750, భద్రా ద్రి జిల్లా సింగభూపాలంలో 750, భద్రాద్రి జిల్లా దురదపాడులో 1,000, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అంజనగిరిలో 944 మెగావాట్ల ప్లాంట్లను నిర్మించాలని జెన్కో అధికారులు సర్వే చేశారు. కానీ, సీఈఏ తాజాగా ప్రకటించిన రోడ్‌మ్యాప్‌లో ఇవేవి లేవు.
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై జెన్కో చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది. థర్మల్, జల విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు, నిర్వహణలో అనుభవమున్న ఈ సంస్థ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపడం లేదు. శ్రీశైలం ఎడమ గట్టున 900, నాగార్జునసాగర్‌లో 705 కలిపి 1,605 మెగావాట్ల రివర్సబుల్ పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లను నిర్వహిస్తున్న జెన్కో.. పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై దృష్టిపెట్టడంలేదు. దీంతో ప్రైవేట్ రంగంలోని గ్రీన్కో, అస్తా తెలంగాణ, శ్రీసిద్ధార్థ ఇన్ఫ్రాటెక్ అండ్ సర్వీసెస్ ఇండియా సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. సింగరేణి సంస్థ సైతం రామగుండంలో పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌ను నెలకొల్పుతున్నది.