ఖమ్మం కమాన్బజార్, జూన్ 21 : ఆర్టీసీ పరిరక్షణ, కార్మిక చట్టాల రక్షణ కోసం సిద్ధం కావాలని అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మయ్య పిలుపునిచ్చారు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర 4వ మహాసభలు శనివారం ఖమ్మం ఐఎంఏ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ఆర్టీసీ సంస్థలకు సమాధి కట్టేలా 2019 మోటర్ వాహన చట్టం సవరణకు కేంద్రం పూనుకోవడం దారుణమన్నారు.
ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లు, అగ్రిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ పాలసీ పేరుతో ఊబర్, ఓలాతోపాటు బహుళజాతి రవాణా సంస్థలు భారత రవాణా రంగంలోకి చొరబడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు కార్మిక, కర్షక మైత్రితో సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గాలు పాల్గొనాలని కోరారు.